వైరస్‌ వెంటాడినా వెరవని రిటైల్‌ దిగ్గజం

6 May, 2020 16:26 IST|Sakshi

కోవిడ్‌-19 సెగలతో కరిగిన కుబేరుల సంపద

సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్బ్స్‌ 2020 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రూ 2.7 లక్షల కోట్ల సంపదతో అగ్ర స్ధానాన్ని నిలుపుకున్నారు. ఏడాది కిందటితో పోలిస్తే రూ 99,000 కోట్ల మేర ఆయన సంపద తరిగిపోయినా నెంబర్‌ వన్‌ స్ధానాన్ని ముఖేష్‌ నిలబెట్టుకున్నారు. ఇక స్టాక్‌మార్కెట్‌ కుదేలవుతున్నా రిటైల్‌ దిగ్గజం డీ మార్ట్‌ అధిపతి రాధాకృష్ణన్‌ దామాని రూ 1.3 లక్షల కోట్ల సంపదతో భారత్‌లో అత్యంత సంపన్నుల్లో రెండవ స్ధానంలో నిలిచారు.

దామాని సంపద 25 శాతం పెరగడంతో ఈ జాబితాలో తొలిసారిగా ఆయన రెండో స్ధానానికి ఎగబాకారు. కోవిడ్‌-19 ప్రభావం వెంటాడినా దామాని సంపద ఎగబాకడం గమనార్హం. ఓవైపు స్లోడౌన్‌ సెగలు ఆపై కోవిడ్‌-19 లాక్‌డౌన్‌లతో 2020లో భారత సంపన్నుల రాబడి గణనీయంగా తగ్గిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గగా బిలియనీర్ల మొత్తం సంపద ఏకంగా 23 శాతం పడిపోయింది.

చదవండి : ముఖేష్‌ను వెనక్కినెట్టిన జాక్‌మా

ఇక హెచ్‌సీఎల్‌ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్‌ రూ 89,250 కోట్ల సంపదతో భారత బిలియనీర్ల జాబితాలో మూడవ స్ధానం దక్కించుకున్నారు. ఇక ఫోర్బ్స్‌ జాబితాలో నాలుగో అత్యంత భారత సంపన్నుడిగా రూ 78,000 కోట్ల సంపదతో ఉదయ్‌ కొటక్‌ నిలవగా, గౌతం ఆదాని రూ 66,700 కోట్లతో ఐదవ స్ధానంలో ఉండగా, టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ వ్యవస్ధాపకుడు సునీల్‌ మిట్టల్‌ రూ 67,000 కోట్ల సంపదతో ఆరో స్ధానంలో నిలిచారు. ఇక సైరస్‌ పూనావాలా, కుమార్‌ బిర్లా, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌, అజీం ప్రేమ్జీ-దిలీప్‌ సంఘ్వీలు టాప్‌ 10 బిలియనీర్ల జాబితాలో చోటుదక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు