ప్రపంచ కుబేరుల టాప్‌-10 జాబితాలో స్థానం

22 Jun, 2020 11:07 IST|Sakshi

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ కొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచ టాప్‌-10 కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. తాజాగా ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం లభించింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ఆయనకు 9వ స్థానం దక్కింది. ముకేశ్‌ అంబానీ నికర సంపద 64.5 బిలియన్ డాలర్లుగా సదరు సంస్థ పేర్కొన్నది. ప్రపంచ సంపన్నుల జాబితాలోకెక్కే క్రమంలో ముకేశ్‌ అంబానీ.. ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్‌​లను అధిగమించారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్ బుక్) ఉన్నారు. (అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ)

ప్రస్తుతం కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్నప్పటికి ముకేశ్‌ అంబానీ జియో ప్లాట్ ఫామ్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్‌లో 42 శాతం వాటాలు ఉన్న ముఖేశ్ అంబానీ ఇటీవల పెట్టుబడుల పుణ్యమా అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చేశారు. రిలయన్స్ టెలికాం  విభాగం  జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు రైట్స్ ఇష్యూ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ 115,693.95 కోట్ల రూపాయలు సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ కావడం మరో విశేషం. దీని ద్వారా 53,124.20 కోట్ల రూపాయలను సాధించింది.  కేవలం 58 రోజుల్లో 168,818 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకోవడంతో  రిలయన్స్  నిర్దేశిత లక్ష్యం నెరవేరింది.()

ఇక ముకేష్‌ అంబానీకి ముంబైలో 4 లక్షల చదరపు అడుగుల్లో  27 అంతస్తుల ఇంద్రభవనం అంటిలియా ఉంది. అంటిలియా నిర్మాణ వ్యయం వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల డాలర్లుంటుందని అంచనా. ఈ ఇంటిలో పార్కింగ్ కోసమే ఆరు అంతస్తులు కేటాయించారు. మూడు హెలిప్యాడ్‌లు, 68 కార్ల పార్కింగ్, 50 సీట్ల సినిమా థియేటర్, క్రిస్టల్ షాన్డిలియర్‌లతో కూడిన గొప్ప బాల్రూమ్, బాబిలోన్‌ ఊగే తోటల స్ఫూర్తితో మూడు అంతస్తుల హ్యంగింగ్ గార్డెన్‌, యోగా స్టూడియో, హెల్త్ స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి సకల హంగులతో వెలుగొందుతోంది.

మరిన్ని వార్తలు