ముకేశ్‌ అంబానీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

28 Feb, 2020 21:21 IST|Sakshi

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. సీఎన్‌బీసీ-టీవీ18 ఐకానిక్‌ బిజినెస్‌ లీడర్‌ ఆఫ్‌ ది డికెడ్‌గా ముకేశ్‌ అంబానీ నిలిచారు. సీఎన్‌బీసీ-టీవీ18 నిర్వహించిన ఇండియన్‌ బిజినెస్‌ లీడర్స్‌ అవార్డుల ప్రధానోత్సవం శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేతుల మీదుగా ముకేశ్‌ ఐకానిక్‌ బిజినెస్‌ లీడర్‌ ఆఫ్‌ ది డికెడ్‌ అవార్డును అందుకున్నారు. ముకేశ్‌ నాయకత్వంలో రిలియన్స్‌ గ్రూప్‌ భారత్‌లోనే అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును ముకేశ్‌ తన తండ్రి, రిలయన్స్‌ వ్యవస్థాపకుడు ధీరుభాయ్‌ అంబానీతోపాటు, కంపెనీలోని యంగ్‌ లీడర్స్‌కు అంకితమిచ్చారు. 

ఈ సందర్భంగా ముకేశ్‌ మాట్లాడుతూ.. ఒక వస్త్ర సంస్థగా ప్రారంభమైన తమ కంపెనీ పెట్రోకెమికల్‌ కంపెనీగా మారిందని గుర్తుచేశారు. గత నాలుగు దశాబ్దాలుగా రిలయన్స్‌ను అనుసరిస్తున్న వారికి తమను తాము ఎలా మార్చుకున్నామో తెలుస్తుందన్నారు. గత దశాబ్దంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి రిటైల్‌, వినియోగదారుల టెక్‌ వ్యాపారాన్ని నిర్మించిందని తెలిపారు. తమ కంపెనీ యువ నాయకత్వం తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అలాగే రిలయన్స్‌ కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో ఆకాశ్‌ అంబానీ, ఇషా అంబానీల పాత్రను ముకేశ్‌ ప్రస్తావించారు. వచ్చే దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధి కనబరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు