రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు

26 May, 2020 13:03 IST|Sakshi

ముకేశ్ అంబానీ  చిన్న కుమారుడు అనంత్ అంబానీ డెబ్యూ

జియో  ప్లాట్‌ఫామ్స్‌లో  డైరెక్టర్ గా అనంత్ అంబానీ

సాక్షి, ముంబై: వరుస భారీ ఒప్పందాలతో సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియోకు సంబంధించిన మరో కీలక అంశం ఇపుడు వార్తల్లో నిలిచింది.  రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు దూసుకొస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్  చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(25) జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్ గా  రిలయన్స్  వ్యాపార   సామ్రాజ్యంలోకి  అడుగు పెట్టనున్నారు.  దీనికి సంబంధించి రిలయన్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం.(ప్రత్యర్థులకు గుబులు : దూసుకొచ్చిన జియో మార్ట్)

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారని బిజినెస్ సర్కిల్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి లాక్ డౌన్ ప్రకటించడానికి వారం రోజులముందే ఈ పరిణామం చోటు చేసుకుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.  దీనిపై  త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. 

అనంత్ తోబుట్టువులు ఆకాశ్ అంబానీ, ఇషా ఇద్దరూ ఇప్పటికే వ్యాపార బాధ్యతల్లో చురుగ్గా ఉన్నారు. 2014లో జియో. రిటైల్ వ్యాపారాల బోర్డులలో ఇషా, ఆకాశ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి)

ఐపీఎల్ క్రికెట్  మ్యాచ్‌లలో తన తల్లి నీతా అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించే అనంత్ 18 నెలల్లో 108 కేజీలు బరువు తగ్గడం  అప్పట్లో పెద్ద సంచలనం.  కాగా  ఐదు నెలల క్రితం తన తాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా  అతి పిన్న వయస్కుడైన అనంత్ అంబానీ ముఖ్య ఉపన్యాసం (కీ నోట్ అడ్రస్) చేశారు. ఈ సందర్భంగా అనంత్ మాట్లాడుతూ రిలయన్స్ కుటుంబానికి సేవ చేయడమే తన జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యం అనీ,  మార్పునకు భారతదేశం నాయకత్వం వహించాలి.. ఆ మార్పులో రిలయన్స్ ముందంజలో ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు "రిలయన్స్ మేరీ జాన్ హై" (రిలయన్స్ నా జీవితం) అని ప్రకటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు