వారసులొచ్చారు..

12 Oct, 2014 01:16 IST|Sakshi
వారసులొచ్చారు..

* రిలయన్స్‌లో ముకేశ్ అంబానీ సంతానం అరంగేట్రం
* రిలయన్స్ జియోలో డెరైక్టరుగా ఇషా,
* రిటైల్ వెంచర్స్‌లో డెరైక్టరుగా ఆకాశ్


న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వారసులు వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. ఆయన సంతానం ఇషా, ఆకాశ్.. రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డెరైక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇషా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు ఆకాశ్ డెరైక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ తెలిపింది. శనివారం ఆయా సంస్థల బోర్డు సమావేశాల్లో ఈ మేరకు ఆమోదముద్ర పడినట్లు వివరించింది. అలాగే, ఆర్‌ఐఎల్‌లో ప్రస్తుతం స్వతంత్ర డెరైక్టరుగా ఉన్న అదిల్ జైనుల్‌బాయ్ తాజాగా రిలయన్స్ రిటైల్ బోర్డులో నియమితులైనట్లు పేర్కొంది.

ముకేశ్ అంబానీకి మొత్తం ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ (23) కవలలు. ఆఖరువాడైన అనంత్ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 1981లో రిలయన్స్‌లో చేరే నాటికి ముకేశ్ అంబానీ వయస్సు 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఇషా, ఆకాశ్ కూడా దాదాపు అంతే వయస్సులో కంపెనీలో చేరడం విశేషం. సైకాలజీలో ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ చేశారు. కొంత కాలం పాటు అమెరికాలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో కూడా పనిచేశారు. మరోవైపు ఆర్థిక శాస్త్రంలో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆకాశ్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆర్‌ఐఎల్ టెలికం వెంచర్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశాల్లో అంబానీ కుటుంబం మొత్తం సాధారణంగానే కనిపించినా.. కీలకమైన బిజినెస్ డీల్‌లో ఆకాశ్ తొలిసారిగా 2011లో పాలుపంచుకున్నారు. అప్పట్లో కేజీ-డీ6 బ్లాక్‌లో వాటాలను బీపీకి రిలయన్స్ విక్రయించినప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా ఆయన ప్రముఖంగా కనిపించారు. ఇక, ఇషా 16 సంవత్సరాల వయసులో వెలుగులోకి వచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల వారసుల్లో పిన్న వయస్కులకు సంబంధించి ఫోర్బ్స్ జాబితాలో ఆమె రెండో స్థానంలో నిల్చారు.
 
షేల్ గ్యాస్ వెంచర్లో వాటాలు విక్రయిస్తున్న రిలయన్స్
న్యూయార్క్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. అమెరికాలోని ఈగిల్ ఫోర్డ్ షేల్ ఆయిల్, గ్యాస్ వెంచర్లో తమకున్న 45% వాటాలను విక్రయించాలని యోచిస్తోంది. కొనుగోలుదారులను అన్వేషించే బాధ్యతను సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్‌లకు అప్పజెప్పినట్లు సమాచారం. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్ (ఆర్‌ఐఎల్) వర్గాలు నిరాకరించాయి.
 
మెకిన్సే లింకు..
ఇటీవల కుటుంబ వ్యాపారాల్లో చేరిన వారసుల్లో చాలా మంది ఏదో ఒక సందర్భంలో మెకిన్సే లేదా మరో కన్సల్టెన్సీలో పని చేసి ఉండటం గమనార్హం. స్వాతి, అజయ్ పిరమాల్ కుమార్తె నందిని పిరమాల్.. సొంత కంపెనీలో చేరడానికి ముందు మెకిన్సేలో బిజినెస్ అనలిస్టుగా చేశారు. తాజాగా ఇషా కూడా మెకిన్సేలో పనిచేశారు. అటు విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ.. కొంతకాలం లండన్‌లోని బెయిన్ అండ్ కో కన్సల్టెన్సీలో చేశారు.
 
రిలయన్స్ సామ్రాజ్యం..

దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ అయిన ఆర్‌ఐఎల్ టర్నోవరు రూ. 4,46,339 కోట్లు కాగా 2013-14లో సంస్థ నికర లాభం రూ. 22,493 కోట్లు. టెలికం సర్వీసుల కోసం ఆర్‌ఐఎల్ ప్రత్యేకంగా రిలయన్స్ జియోను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ స్పెక్ట్రం దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ సంస్థ ఇదే. త్వరలోనే 4జీ సర్వీసులు ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 148 నగరాల్లో 1,723 స్టోర్స్ ఉన్నాయి.

మరిన్ని వార్తలు