ఆసియాలో ముకేశ్‌ ఫ్యామిలీయే రిచ్‌చ్‌చ్‌!

17 Nov, 2017 00:00 IST|Sakshi

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో అంబానీ కుటుంబమే టాప్‌

సంపద విలువ 44.8 బిలియన్‌ డాలర్లు

రెండో స్థానంలో శాంసంగ్‌ లీ కుటుంబం  

న్యూఢిల్లీ: సంపదలో ముకేశ్‌ అంబానీ ఖ్యాతి దేశం దాటి ఖండాంతరాల్లో మారుమోగుతోంది. ఇప్పటిదాకా ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ఉంటూ వస్తున్న ముకేశ్‌ అంబానీ... ఇపుడు ఆసియాలోనూ ఆ ఘనత సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన తాజా జాబితాలో ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ముకేశ్‌ అంబానీ ఫ్యామిలీ నిలిచింది.  ఈ కుటుంబం తాలూకు సంపద విలువ 19 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో ఏకంగా 44.8 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. దీంతో శాంసంగ్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొరియాకు చెందిన లీ కుటుంబం రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. నిజానికి ఇక్కడ లీ కుటుంబ సంపద కూడా ఏమీ తగ్గలేదు. 11.2 బిలియన్‌ డాలర్ల మేర పెరుగుదలతో 40.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ షేరు ధర గతేడాదితో పోలిస్తే 75%మేర లాభపడింది. కానీ వీరి సంపద కన్నా ముకేశ్‌ అంబానీ కుటుంబ సంపద జెట్‌ స్పీడ్‌లో పెరిగిపోయింది. ఇక హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాక్‌ కుటుంబం మూడో స్థానంలో ఉంది. వీరి నికర సంపద విలువ 40.4 బిలియన్‌ డాలర్లు. ఆసియాలోని అత్యంత సంపన్న రియల్‌ ఎస్టేట్‌ కుటుంబం ఇది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సన్‌ హంగ్‌ కై ప్రాపర్టీస్‌ వీరిదే. ప్రముఖ బిజినెస్‌ మేగజైన్‌ ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసిన ‘ఆసియాలోని టాప్‌–50 అత్యంత ధనిక కుటుంబాల జాబితా–2017’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం..

టాప్‌–10లో భారత్‌ నుంచి ముకేశ్‌ అంబానీ కుటుంబం మాత్రమే స్థానం పొందింది. అయితేనేం!! జాబితాలో ఎక్కువ కుటుంబాలు ఇండియా నుంచే ఉన్నాయి.
జాబితాలో భారత్‌ నుంచి మొత్తంగా 18 కుటుంబాలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో ప్రేమ్‌జీ కుటుంబం (19.2 బిలియన్‌ డాలర్లు–11వ స్థానం), హిందుజా కుటుంబం (18.8 బిలియన్‌ డాలర్లు–12వ స్థానం), మిట్టల్‌ కుటుంబం (17.2 బిలియన్‌ డాలర్లు–14వ స్థానం), మిస్త్రీ కుటుంబం (16.1 బిలియన్‌ డాలర్లు–16వ స్థానం), బిర్లా కుటుంబం (14.1 బిలియన్‌ డాలర్లు–19వ స్థానం) తదితరులున్నారు.
జాబితాలోని 50 కుటుంబాల మొత్తం సంపద విలువ 699 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇందులో దాదాపు 200 బిలియన్‌ డాలర్లమేర పెరుగుదల నమోదయ్యింది.
జాబితాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక కుటుంబం సంపద విలువ కనీసం 5 బిలియన్‌ డాలర్లు ఉండాలి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.32,500 కోట్ల పైమాటే!!. 

మరిన్ని వార్తలు