ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..

11 Oct, 2019 18:33 IST|Sakshi

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముఖేష్‌ అంబానీ 2019 ఏడాదికిగాను ఫోర్బ్స్‌ ప్రకటించిన భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచారు. 51.4 బిలియన్‌ డాలర్ల (రూ 3.85 లక్షల కోట్ల) విలువైన నికర ఆస్తులతో ముఖేష్‌ అంబానీ వరుసగా 12వ సారి భారత సంపన్నుల్లో టాప్‌ ప్లేస్‌ను దక్కించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది సంక్లిష్ట సంవత్సరమైనా ఆర్‌ఐఎల్‌ టెలికాం విభాగం జియో సత్తా చాటడంతో ముఖేష్‌ అంబానీ సంపదకు 400 కోట్ల డాలర్లు పైగా తోడయ్యాయని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఇక ముఖేష్‌ తర్వాత బిజినెస్‌ దిగ్గజాలు గౌతం ఆదాని, హిందుజా బ్రదర్స్‌, పలోంజి మిస్త్రీ, బ్యాంకర్‌ ఉదయ్‌ కొటక్‌ల సంపద కూడా ఈ ఏడాది గణనీయంగా వృద్ధి చెంది వరుసగా రెండు నుంచి ఐదు స్ధానాల్లో నిలిచారని తెలిపింది. ఇంకా ఈ జాబితాలో టాప్‌ 10 స్ధానాల్లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ్‌నాడార్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ అధినేత దమాని, గోద్రెజ్‌ కుటుంబం, పారిశ్రామిక దిగ్గజాలు కుమార మంగళం, బిర్లా ఫ్యామిలీలు నిలిచాయి. విప్రో అధినేత అజీం ప్రేమ్జీ టాప్‌ 17వ స్ధానం దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు