లక్ష జనాభా ఉంటే ‘బీ న్యూ’ స్టోర్‌

13 Mar, 2018 01:31 IST|Sakshi

ఈ ఏడాది మరో 85 ఔట్‌లెట్లు

ల్యాప్‌టాప్స్‌ విక్రయాల్లోకి వస్తాం

‘బీ న్యూ’ ఫౌండర్‌ బాలాజీ చౌదరి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ విక్రయంలో ఉన్న ‘బీ న్యూ’ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగా వారానికి ఒక స్టోర్‌ తెరుస్తోంది. ప్రస్తుతం సంస్థకు 49 కేంద్రాలు ఉన్నాయి.  ఈ వారం 50వ ఔట్‌లెట్‌ను విజయనగరంలో ప్రారంభిస్తోంది. కొద్ది రోజుల్లో కరీంనగర్, గుడివాడ, ప్రొద్దుటూరులో అడుగు పెడుతోంది.

డిసెంబరులోగా తెలంగాణలో 60 స్టోర్లు రానున్నాయని ‘బీ న్యూ’ మొబైల్స్‌ వ్యవస్థాపకులు వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ఇందులో సగం హైదరాబాద్‌లో ఉంటాయని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మరో 25 ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డిసెంబరుకల్లా మొత్తం 135 కేంద్రాలను దాటు తామన్నారు. కంపెనీ విస్తరణ, భవిష్యత్‌ ప్రణాళిక ఆయన మాటల్లోనే..

విద్యార్థుల కోసం గ్యాడ్జెట్లు..
బీ న్యూ ఔట్‌లెట్లలో అన్ని ప్రముఖ కంపెనీల మొబైళ్లు, ట్యాబ్లెట్‌ పీసీలు, యాక్సెసరీస్‌ విక్రయిస్తున్నాం. త్వరలో ల్యాప్‌టాప్స్‌ అమ్మకాల్లోకి అడుగు పెట్టబోతున్నాం. అలాగే పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాం. దేశంలో ఏ కొత్త ఉత్పాదన వచ్చినా ప్రజలకు అందిస్తున్నాం.

పాఠశాలల్లో డిజిటల్‌ బోధనకు ఉపయోగపడే ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లు అందుబాటు ధరలో పరిచయం చేయబోతున్నాం. వినూత్న గ్యాడ్జెట్ల సేకరణలో మా టీమ్‌ నిమగ్నమైంది. సర్వీస్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రిపేర్‌ అదేరోజు గనక కాకపోతే కస్టమర్‌కు స్టాండ్‌ బై ఫోన్‌ ఇచ్చేలా బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం.

ప్రతి మొబైల్‌పై బహుమతి..
మా ఔట్‌లెట్లలో రూ.499తో మొదలై రూ.1 లక్ష విలువ చేసే మోడళ్లనూ అమ్ముతున్నాం. ప్రతి మొబైల్‌ కొనుగోలుపై ఒక బహుమతి ఖచ్చితంగా అందిస్తున్నాం. సీజన్‌నుబట్టి స్కూల్‌ బ్యాగ్‌ వంటి గిఫ్టులు ఇస్తున్నాం. ప్రస్తుతం రూ.1,599 విలువ చేసే మొబైల్‌పై టేబుల్‌ ఫ్యాన్‌ ఉచితంగా అందజేస్తున్నాం.

వినియోగదార్ల సౌకర్యార్థం ప్రతి స్టోర్‌లో 100 మోడళ్ల వరకు డిస్‌ప్లే ఉంచుతున్నాం. ప్రస్తుతం నెలకు 50,000 యూనిట్ల ఫోన్లు అమ్ముతున్నాం. ఇందులో స్మార్ట్‌ఫోన్ల వాటా 75 శాతముంది. ఒక్కో స్టోర్‌ ప్రాంతాన్ని బట్టి 500 నుంచి 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

రెండు రెట్ల టర్నోవర్‌..
బాలాజీ వాచ్‌ కంపెనీ పేరుతో నెల్లూరులో 1990లో రిటైల్‌లో అడుగు పెట్టాం. రిటైల్‌లో 28 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్‌లో మొబైల్స్‌ ప్రవేశించిన నాటి నుంచే ఈ రంగంలో ఉన్నాం. ప్రముఖ బ్రాండ్ల సూపర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సైతం చేపట్టాం. 2014లో ‘బీ న్యూ’కు శ్రీకారం చుట్టాం. తొలి కేంద్రం విజయవాడలో ప్రారంభించాం. 2017లో ఏకంగా 30 స్టోర్లు తెరిచాం.

ఇప్పటి వరకు తెలంగాణలోని హన్మకొండ మినహా మిగిలిన ఔట్‌లెట్లన్నీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయి. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్‌ చేశాం. లక్ష జనాభా ఉన్నచోట స్టోర్‌ను అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్‌ ఆశిస్తున్నాం. విస్తరణతో 2018–19లో టర్నోవర్‌ రెండింతలకు చేరుకుంటుంది. 2019లో కర్ణాటకలో అడుగు పెట్టాలని నిర్ణయించాం. సంస్థ వద్ద 600 మంది ఉద్యోగులు ఉన్నారు.   

మరిన్ని వార్తలు