వంటింటికి మల్టీపర్పస్ సోకు..!

29 Jun, 2016 00:48 IST|Sakshi
వంటింటికి మల్టీపర్పస్ సోకు..!

పెరుగుతున్న కిచెన్ అప్లయన్సెస్ వాడకం
పలు పనులు చేసేలా మార్కెట్లోకి వినూత్న ఉత్పత్తులు
రూ.13,000 కోట్లకు చేరిన మార్కెట్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జ్యూసర్, కాఫీ మేకర్, ఓవెన్, సాండ్‌విచ్ మేకర్, టోస్టర్, ఎయిర్ ఫ్రైయర్స్... ఇలా చెప్పుకుంటూ పోతే వంటగదిలో ఉండే ఉపకరణాలు... అవేనండీ కిచెన్ అప్లయన్సెస్ లిస్టు బోలెడంత ఉంటుంది. చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోవటం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, భిన్నమైన ఆహారపు అలవాట్లు.. వెరశి వంటింట్లో ఇప్పుడీ ఉపకరణాల జాబితా పెరుగుతూనే వస్తోంది. దీంతో విభిన్న అవసరాలకు తగ్గట్టుగా వినూత్న, అత్యాధునిక పరికరాలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టేస్తున్నాయి. సమయం వెంట పరుగులు తీస్తున్న నేటి తరం... వంట వేగంగా చేసేందుకు వీలుగా కిచెన్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. రూ.13,000 కోట్ల భారత వ్యవస్థీకృత రంగ కిచెన్ అప్లయన్సెస్ విపణిలో విదేశీ కంపెనీలకు దీటుగా దేశీ బ్రాండ్లు చొచ్చుకు పోతున్నాయి. నెల వాయిదాల్లో వస్తువుల్ని ఆఫర్ చేస్తూ కస్టమర్లకు చేరువవుతున్నాయి.

 విభిన్న పనులను చేసేలా...
ఎగువ మధ్య తరగతి, సంపన్న కుటుంబాలైతే వంటింట్లో అన్ని ఉపకరణాలు ఉండాల్సిందేనని అంటున్నారు. వంట చేసే సమయంలో బంధువులు, స్నేహితులు వంటింట్లోకి కూడా వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు.. కస్టమర్లను ఇట్టే ఆకట్టుకునే రీతిలో కలర్‌ఫుల్ అప్లయన్సెస్‌తో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటితో స్టేటస్ చూపించుకునేవారు కొందరైతే అవసరానికి ఉపకరణాలను కొనేవారూ ఉన్నారు. ఇక వంటింటి స్థలం పరిమితంగా ఉన్న కుటుంబాలైతే విభిన్న పనులను చేసే మల్టీ టాస్క్ ఉపకరణాలు కావాలంటున్నారని ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ సీఈవో రూపేంద్ర యాదవ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.  కొత్త ఇల్లు కొనుక్కున్నా, వివాహ సమయంలోనైనా నూతన ఉపకరణాలను కొంటున్నారని తెలియజేశారు. ‘‘ఇవి ఔరా అనిపించే ఫీచర్లతో వస్తున్నాయి. అయితే తయారీ కంపెనీలు వీటిపట్ల మరింత అవగాహన కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయి’’ అని టీఎంసీ  బేగంపేట మేనేజర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

 ఇదీ మార్కెట్ తీరు..: అంతర్జాతీయంగా బ్లెండర్ల వాడకం ఎక్కువ. ఇండియాలోనైతే మిక్సర్ గ్రైండర్ల వాడకం అధికం. వీటి వ్యాపార పరిమాణం దేశంలో రూ.2,600 కోట్లు. కాకపోతే దేశంలో 25-30% ప్రాంతంలోనే వీటిని వినియోగిస్తున్నారు. దక్షిణాదిలో ఇది 40% కాగా, తమిళనాట ఏకంగా 70%. దక్షిణాదికే పరిమితమైన వెట్ గ్రైండర్ల విపణి పరిమాణం రూ.500 కోట్లు. ఎలక్ట్రిక్ కుకర్ల రంగం విలువ రూ.1,000 కోట్లు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 40%. వ్యవస్థీకృత రంగంలో కిచెన్ అప్లయెన్సెస్ విపణి 3-4% వృద్ధి రేటుతో రూ.13,000 కోట్లుందని ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ అంటోంది. వినూత్న ప్రొడక్టును రూపొం దించినా దీర్ఘకాలిక ప్రక్రియ కావడంతో పేటెంట్ల దరఖాస్తుకు కంపెనీలు దూరంగా ఉంటున్నాయి. ఉపకరణాల ధర ఏటా 4-5% పెరుగుతోంది.

కొన్ని పరికరాల ఉదాహరణలుఇవిగో...
ప్రీతి జోడియాక్ మిక్సర్ గైండర్
పండ్ల రసం తీయడం, గోధుమ పిండిని ముద్దగా చేయడం, కూరగాయలను తురమడం, ముక్కలుగా చేయడం వంటి పనులను చక్కబెడుతుంది. ధర రూ.8,960.

 ప్రీతి కిచెన్ చాంప్
17 రకాల పనులను ఇట్టే చేస్తుంది. పిండి కలపడం, కూరగాయలు ముక్కలు చేయడం, తురమడం, కలపడం, ఆర బెట్టడం, పిండి రుబ్బడం, పొడి చేయడం వీటిలో కొన్ని. ఏడాది వారంటీతోపాటు లైఫ్ లాంగ్ ఉచిత సర్వీసును కంపెనీ ఆఫర్ చేస్తోంది. ధర రూ.4,199.

 ఉషా ఇన్‌ఫినిటీ కుక్
హాలోజెన్ ఓవెన్ ఇది. ఇతర ఓవెన్లతో పోలిస్తే చాలా భిన్నమైంది. నీళ్ల అవసరం లేకుండా కోడి గుడ్లను ఉడికిస్తుంది. బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, ఎయిర్ ఫ్రైస్, ఎయిర్ డ్రయింగ్, టోస్టింగ్ వంటి పనులనూ చేస్తుంది. ఆయిల్ ఫ్రీ కుకింగ్ దీని ప్రత్యేకత. బ్రెడ్ ర్యాక్, చికెన్ రోస్టర్, ఫ్రయింగ్ ప్యాన్ తదితర 9 యాక్సెసరీన్ పొందుపరిచారు. ధర రూ.11,990.

 ఉషా న్యూట్రిప్రెస్
ఖరైదైన జ్యూసర్లలో ఇది ఒకటి. ధర రూ.27,990. కూరగాయలు, ఆకు కూరలు, గింజలు, పండ్ల నుంచి రసం తీస్తుంది. ఇతర జ్యూసర్లతో పోలిస్తే అధిక మొత్తంలో రసం అందిస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ వ్యవస్థ ఉండడంతో జ్యూస్ తీసే క్రమంలో పోషకాలు, ఎంజైములు, విటమిన్లు కోల్పోవని కంపెనీ తెలిపింది.

 బజాజ్ మాస్టర్ షెఫ్ 3.0 ఫుడ్ ప్రాసెసర్
దీనితో 15 రకాల అటాచ్‌మెంట్స్ ఉన్నాయి. పచ్చడి చేయడం, ముక్కలు తరగడం, కొబ్బరి తురమడం, పిండి కలపడం, జ్యూస్, రుబ్బడం, ఫ్రెంచ్ ఫ్రైస్, తురమడం వంటివి చిటికెలో చేసిపెడుతుంది. ధర రూ.5,984.

మరిన్ని వార్తలు