చోక్సికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన గృహ కొనుగోలుదారులు

21 Jun, 2018 15:26 IST|Sakshi

ముంబై : ఇటీవల యావత్ దేశం మొత్తంలో పెను సంచలనంగా మారిన నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సి కుంభకోణంలో కేవలం బ్యాంకులు మాత్రమే కాక, గృహకొనుగోలు దారులు కూడా భారీగా నష్టపోయారట. లగ్జరీ రెసిడెన్షియల్‌ గృహాలు కట్టి ఇస్తానని చెప్పిన మెహుల్‌ చోక్సి, వారి వాగ్ధానాలను నేరవేర్చకుండా.. పీఎన్‌బీలో భారీ కుంభకోణం జరిపి దేశం విడిచి పారిపోయాడు. దీంతో పీఎన్‌బీ బ్యాంక్‌తో పాటు తమకు అన్యాయం జరిగింది అంటూ.. గృహ కొనుగోలుదారులు కూడా రోడ్డుపైకి వచ్చారు. 

డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ మేనమామ అయిన మెహుల్‌ చోక్సి గీతాంజలి జువెల్లరీ సంస్థలతో పాటు గీతాంజలి ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ను కూడా నిర్వహిస్తుండేవాడు. ఈస్ట్‌ బోరివ్లిలోని తత్వా టవర్స్‌ను కట్టేందుకు ఈ సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుంది. 2010లో ఈ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ తత్వాను గీతాంజలి ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ప్రారంభించింది. 20, 21 అంతస్తుల చొప్పున రెండు టవర్లలో దీన్ని కట్టాల్సి ఉంది. మొత్తం 155 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. 2013 వరకు వీటిని గృహకొనుగోలుదారులకు అందించాల్సి ఉంది. కానీ 2013 డిసెంబర్‌లో తొలుత తన వాగ్దానాన్ని బ్రేక్‌ చేసి, 2015 వరకు తుది గడువును పొడిగించింది మెహుల్‌ చోక్సి సంస్థ. ఆ అనంతరం ఆ గడువును మరింత కాలం అంటే 2017 డిసెంబర్‌కు పొడిగించింది. ఇలా ఫ్లాట్స్‌ను అందించడంలో జాప్యం చేస్తూనే ఉంది. 

దీంతో విసుగెత్తిన గృహకొనుగోలుదారులు, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా), నేషనల్‌ కన్జ్యూమర్‌ డిస్పూట్‌ రెడ్రిషల్‌ కమిషన్‌ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారు. గృహకొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు ఈ డిసెంబర్‌ వరకు ఫ్లాట్లను ఎలాగైనా ఇచ్చేస్తామని చెప్పారు. కానీ పీఎన్‌బీ స్కాం ఎఫెక్ట్‌తో చోక్సి దేశం విడిచి పారిపోయాడు. చోక్సి విదేశాలకు జంప్‌ చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌ను సైతం కొత్త డెవలపర్‌ లక్ష్మి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ను నియమించారు అలాటీస్‌. తత్వా టవర్స్‌కు బయట ఒక నోటీసు బోర్డు ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని గృహకొనుగోలుదారులంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం ఆపివేశారని, ఎవరూ ఈ ప్రాజెక్ట్‌కు బాధ్యత వహించడం లేదని, చోక్సి కూడా దేశం విడిచి పారిపోయాడని పేర్కొంటున్నారు. నిర్మాణం కావాల్సిన ప్రాజెక్ట్‌ వద్దే గృహకొనుగోలుదారులు తమకు జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు