పీఎంసీ బ్యాంక్‌ స్కాంపై 32 వేల పేజీల చార్జిషీట్‌

28 Dec, 2019 03:21 IST|Sakshi

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ స్కాంకు సంబంధించి ఐదుగురు నిందితులపై 32 వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జిషీట్‌లో ఆ బ్యాంకు మాజీ ఎండీ జాయ్‌ థామస్, మాజీ చైర్మన్‌ వర్యమ్‌ సింగ్, మాజీ డైరక్టర్‌ సుర్జిత్‌ సింగ్‌ ఆరోరాతో పాటు, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) ప్రమోటర్లు రాకేశ్‌ వర్ధమాన్, సారంగ్‌ వర్ధమాన్‌ నిందితులుగా పేర్కొన్నారు.

మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించడానికి సంబంధించి ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్యాంక్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. వీరిపై అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంది. కాగా ఈ 32 వేల పేజీల చార్జిషీట్‌లో పీఎంసీ బ్యాంక్‌ ఫోరెన్సిక్‌ అడిట్‌ రిపోర్టు, బ్యాంకు సొమ్ముతో నిందితుల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాదారులతో పాటు 340 మంది సాక్షుల వాంగ్మూలాలు తదితర వివరాలు ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు