-

రూ.300 కోట్ల వ్యక్తిగత రుణాలిస్తాం

11 Jul, 2018 00:24 IST|Sakshi

ఈ ఏడాది లక్ష్యంపై ముత్తూట్‌ ఈడీ జార్జ్‌ వ్యాఖ్య

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ముత్తూట్‌ ఫైనాన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవలే వ్యక్తిగత రుణాల విభాగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ... 2018 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.30 కోట్లను కస్టమర్లకు అందించింది. అయిదేళ్లలో రూ.3,000 కోట్ల స్థాయికి ఈ విభాగాన్ని తీసుకెళతామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఈడీ జార్జ్‌ ఎం అలెగ్జాండర్‌ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.

ఉద్యోగం చేస్తున్న వారికే రుణాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలుత హైదరాబాద్‌లోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. రెండు రోజుల్లో రుణం మంజూరు చేస్తారు. కస్టమర్‌ కనీస జీతం నెలకు మెట్రో నగరాల్లో రూ.20,000, ఇతర పట్టణాల్లో రూ.10,000 ఉండాలి. రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. వడ్డీ 14– 21 శాతం ఉంటుంది. ఏడాది నుంచి అయిదేళ్ల కాల పరిమితిలో అప్పు తిరిగి చెల్లించాలి.

మరిన్ని వార్తలు