ఫండ్స్‌ ఎంపిక ఇలా కాదు..!

18 Nov, 2019 05:02 IST|Sakshi

డివిడెండ్‌ కంటే ఎస్‌డబ్ల్యూపీ మెరుగు

ఫండ్స్‌ ఆస్తుల సైజు కంటే రాబడులు ముఖ్యం

మంచి పనితీరు ఉంటే, వ్యయాలను పట్టించుకోనక్కర్లేదు

ఫండ్స్‌లో రాబడులకు ఎన్నో జాగ్రత్తలు అవసరం

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ప్రతి నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్‌ (క్రమానుగత పెట్టుబడులు) రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలనే ప్రాథమిక అవగాహన కొందరిలో ఉన్నప్పటికీ.. ఎంపిక విషయంలో పట్టిపట్టి చూడకూడని, అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే ప్రాఫిట్‌ కథనం ఇది.  
    
జీవనశైలి, అవసరాలు, రిస్క్‌ తీసుకునే సా మర్థ్యం ఇవన్నీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే, ఫండ్‌ పనితీరును కూడా ప్రామాణికంగా చూడాల్సి ఉం టుంది. నాణేనికి మరోవైపు అన్నట్టు ఫండ్స్‌లో పెట్టుబడులకు ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇతర ముఖ్య అంశాలపై ఆధారపడడం మంచిదని నిపుణుల సూచన.

డివిడెండ్‌
డివిడెండ్‌ అధికంగా ఇస్తున్నాయని ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే విధమైన డివిడెండ్‌ను పంపిణీ చేయాలన్న హామీ ఉండదు. ఉదాహరణకు మార్కెట్లు పడిపోతే, సంబంధిత ఫండ్‌ డివిడెండ్‌ పంపకాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసమే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ, వస్తున్న లాభాన్ని ఎప్పటికప్పుడు డివిడెండ్‌ రూపంలో తీసేసుకోవడం మంచి ఆలో చన ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లాభాన్ని తీసేసుకోవడం వల్ల పెట్టుబడి వృద్ధి చెందదు. పైగా ఇప్పుడు డివిడెండ్‌ పంపిణీపై ఈక్విటీ ఫండ్స్‌ అయితే 10% పన్ను పడుతోంది. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై 10% పన్నుమాదిరిగానే. కనుక డివిడెండ్‌ ఇస్తున్న వాటిని ఎంపిక చేసుకోవడం సూచనీయం కాదు.

దీనికి బదులు అవసరమైనప్పుడు కొన్ని యూనిట్లను విక్రయించి అవసరాలు తీర్చుకోవడమే మంచిది. డెట్‌ ఫండ్స్‌లో అయితే డివిడెండ్‌ కోసం చూడడం అన్నది ఏ మాత్రం సరికాదు. దీనికంటే క్రమానుగత ఉపసంహరణ(ఎస్‌డబ్ల్యూపీ) అన్నది మరింత సమర్థవంతమైన టూల్‌ అవుతుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో యూనిట్లను ఉపసంహరించుకోవడం ద్వారా అవసరమైన మేర పొందొచ్చు. దీనివల్ల పన్ను పరంగా కలిసొస్తుంది. అదే డెట్‌ ఫండ్స్‌లో డివిడెండ్‌ ఆశిస్తే, డివిడెండ్‌ పంపిణీ పన్ను కింద 29.12% పడుతుంది. ఇన్వెస్టర్‌ ఆదాయం ఏ స్లాబ్‌లో ఉందన్నదానితో సంబం ధం ఉండదు. కానీ, ఎస్‌డబ్ల్యూపీలో పెట్టుబడిపై ఆర్జించిన లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఏ పన్ను రేటులో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో ఉపసంహరించుకునేది కొద్ది మొత్తమే ఉంటుంది కనుక పన్ను భారం అంతగా ఏమీ ఉండదు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని డెట్‌ ఫండ్స్‌లో ఆర్జనకు ముడిపెట్టి సర్దుబాటు చేసుకునే వీలూ ఉంది.

ఫండ్స్‌ సంస్థ తెలియక్కర్లేదు..
మనలో చాలా మందికి కొన్ని బ్యాంకులంటే ఎక్కువగా పరిచయం, అనుబంధం ఉండి ఉంటుంది. కనుక తెలిసిన బ్యాంకుల నిర్వహణలోని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదని భావించే వారూ ఉన్నారు. కానీ, ఇది నిజం కానే కాదు. ఇటీవలి డెట్‌ ఫండ్‌ సంక్షోభంలో బ్యాంకుల మద్దతుగల ఎన్నో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి. పైగా వీటి ఈక్విటీ రాబడుల చరిత్ర కూడా అంత గొప్పగా లేదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ ట్రాక్‌ రికార్డుకు స్థిరత్వం ఎంతో అవసరం. ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డు కూడా ఇక్కడ కీలకం అవుతుంది.

నికర విలువ

స్టాక్స్‌లో పెట్టుబడుల పట్ల అవగాహన ఉన్న వారు అవే అంశాలను ఫండ్స్‌కు అన్వయించడం çసరి కాదు. స్టాక్స్‌లో 52 వారాల గరిష్ట, కనిష్ట ధరలను సాధారణంగా చూస్తుంటారు. కానీ ఫండ్స్‌ యూనిట్ల నికర విలువ 52 వారాల కనిష్ట స్థాయిలో ఉంటే, అది మంచి పెట్టుబడికి సంకేతంగా చూడడం తప్పిదమే కావచ్చు. ఎందుకంటే ఫండ్‌ మేనేజర్‌ ఎంచుకున్న స్టాక్స్‌ పనితీరు బాగాలేకపోయినా యూనిట్ల ఎన్‌ఏవీ పడిపోతుంది.  ఇక మార్కెట్లు పడిపోయినప్పుడు ఫండ్‌ మేనేజర్లు సరసమైన ధరల కంటే దిగొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ విధమైన అవకాశాలున్నాయేమో చూడాలి. దీనికి బదులు ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫండ్‌ యూనిట్లను తక్కువ ధరల వద్ద మరిన్ని జోడించుకోవడంపై దృష్టి సారించొచ్చు.

ఫండ్‌ సైజు
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు, సంబంధిత పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులను ప్రత్యేకంగా చూడడం అవసరం లేదు. అదే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో మాత్రం నిర్వహణ ఆస్తులను చూడడం అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఏ స్థాయిలోఉంటుందో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్‌కు ఆస్తుల పరిమాణం ప్రతికూలంగా మారొచ్చు. ఉదాహరణకు స్మాల్‌క్యాప్‌ ఫండ్‌కు భారీ ఆస్తులు ఉంటే అది సానుకూలం కంటే ప్రతికూలమే అవుతుంది. ఇలా ఫండ్‌ సైజు చూసే వారు ఆస్తులను అద్భుతంగా నిర్వహించే చిన్న సైజు పథకాల్లో పెట్టుబడి అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే ఓ పథకం ఎంపికకు స్థిరమైన రాబడుల చరిత్ర, పోటీ పథకాలతో పోల్చినప్పుడు ఇచ్చిన రాబడులు మెరుగ్గా ఉన్నాయా అన్నవి చూడాలి. అస్తుల పరిమాణాన్ని కాదు.

వ్యయ భారం
ఎక్స్‌పెన్స్‌ రేషియో... ఓ  మ్యూచువల్‌ ఫండ్‌ పథకం తాను నిర్వహించే పెట్టుబడులపై అన్ని రకాల చార్జీలను కలుపుకుని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే దానిని టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోగా చెబుతారు. ఫండ్స్‌ పథకాల ఎంపికకు చూసే అంశాల్లో ఇది కూడా ఒకటి. ఈ చార్జీలను ప్రతి రోజూ ఏఎంసీలు ఫండ్స్‌ యూనిట్ల ఎన్‌ఏవీ నుంచి మినహాయించుకుంటాయి. అంటే కనిపించే ఎన్‌ఏవీ ఖర్చులు మినహాయించుకున్న అనంతర విలువ అని తెలుసుకోవాలి. అయితే, అన్ని వేళలా ఈ ఎక్స్‌పెన్స్‌ రేషియోపై అంతగా ఆధారపడక్కర్లేదు. బెంచ్‌మార్క్, పోటీ పథకాల కంటే మెరుగైన పనితీరు చూపిస్తుంటే, అటువంటి పథకాల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో పట్ల అంత సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు.

డెట్‌ ఫండ్స్‌లో రాబడులు ఎక్కువగా లేకపోతే, అప్పుడు ఎక్స్‌పెన్స్‌ రేషియో రాబడులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అయితే, ఫండ్‌ నాణ్యత, రిస్క్‌ ఆధారిత రాబడుల రేషియో అన్నవి ఎక్స్‌పెన్స్‌ రేషియో కంటే ముఖ్యమైనవిగా గుర్తించాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాది కాల పాయింట్‌ టు పాయింట్‌ రాబడులు అన్నవి రాబడుల పనితీరుకు ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ పథకం 2016లో పనితీరు పరంగా నంబర్‌ 1 స్థానంలో ఉంది. కానీ, మరుసటి ఏడాది మూడో స్థానానికి వెళ్లింది. ఒకే తరహా పనితీరు తర్వాతి సంవత్సరంలోనూ నమోదు చేయడం అన్నది కష్టమే. అందుకే పనితీరు పరంగా స్థిరత్వాన్ని చూడడం అవసరం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు