పిల్లల చదువు కోసం ఫండ్స్‌..

17 Apr, 2017 02:50 IST|Sakshi
పిల్లల చదువు కోసం ఫండ్స్‌..

నాకు ఇటీవలే వివాహమైంది. నా భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. భవిష్యత్తులో సొంత ఇల్లు సమకూర్చుకోవాలనేది మా ఆర్థిక లక్ష్యం. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌లో డివిడెండ్‌లను బాగా చెల్లించే ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలి?
–సుధీర్, విజయవాడ

సొంత ఇల్లు సమకూర్చుకోవడం అనే ఆర్థిక లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే. అయితే డివిడెండ్‌లు ఇచ్చే ఫండ్స్‌ను ఎంచుకోవడం అనేది సరైనది కాదు. డివిడెండ్‌ల రూపంలో ఆదాయం పొందడానికి  ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకూడదు.. ఈక్విటీ ఫండ్స్‌ ద్వారా వచ్చే డివిడెండ్‌.. పెద్దగా ఉండదు. పైగా ఆధారపడదగ్గ ఆదాయం కాదని చెప్పవచ్చు. ఇన్వెస్ట్‌ చేయడానికి ఒక ఫండ్‌ను ఎంచుకోవడానికి డివిడెండ్‌ చెల్లింపు అనేది కీలకం కాకూడదు. ఇన్వెస్ట్‌ చేయడానికి ఒక ఫండ్‌ను ఎంచుకోవాలంటే మీరు చూడాల్సింది.. ఆ ఫండ్‌ గత కొన్నేళ్లలో ఏ స్థాయిల్లో  రాబడులు ఇచ్చిందనే విషయాన్నే. అంతేకాని ఆ ఫండ్‌ ఎంత డివిడెండ్‌లు ఇచ్చింది అనేది అసలు పరిశీలించదగ్గ విషయమే కాదు. మార్కెట్‌ పరిస్థితులు బాగా లేకపోయినా, సదరు ఫండ్‌ డివిడెండ్‌ ఇచ్చిందని, దీంతో ఈ ఫండ్‌ మంచి పనితీరు కనబరుస్తుందని పలువురు ఇన్వెస్టర్లు అపోహపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఓపెన్‌–ఎండ్‌ఈక్విటీ ఫండ్స్‌లో డివిడెండ్‌ అసలు ఏమంత పరిగణించాల్సిన విషయమే కాదు. పైగా ఫండ్‌ ఇచ్చిన డివిడెండ్‌ మేరకు మీ ఫండ్‌  విలువ తగ్గుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక ఫండ్‌  ఎన్‌ఏవీ రూ.20 అనుకుందాం. ఆ ఫండ్‌ 20 శాతం డివిడెండ్‌(ముఖ విలువపై) ప్రకటించిందనుకుందాం. అప్పుడు ఆ ఫండ్‌ ఎన్‌ఏవీ రూ.18కు తగ్గిపోతుంది.  అంటే డివిడెండ్‌ వల్ల ప్రత్యేకమైన లాభాలేమీ లేవని చెప్పవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీ సొమ్మే మీరు తిరిగి వెనక్కి పొందుతారు. నిలకడగా వృద్ధి చెందుతున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేయాలి. గత కొన్నేళ్లలో మంచి రాబడులు ఇచ్చిన ఏవైనా 1–2 ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) ద్వారా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయండి. సొంత ఇల్లు సమకూర్చుకోవాలనుకునే మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాన్ని సాకారం చేసుకోండి.

నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువుల కోసం నెలకు రూ.20,000 చొప్పున సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. అధిక రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా? కొన్ని మంచి ఈక్విటీ ఫండ్స్‌ను సూచించండి.            
 –అజయ్, కరీంనగర్‌

రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం మంచిదే. కానీ రిస్క్‌ను తగ్గించుకోవడం అంతకంటే మంచి విషయం. మీ పిల్లల విద్యావసరాల కోసం ఏదైనా 2–4 మంచి మల్టీ–క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి.  మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి  ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. బిర్లా ఎస్‌ఎల్‌  ఫ్రంట్‌లైన్‌ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ, మిరా అసెట్‌ ఇండియా ఆపర్చునిటీ.  మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, సిప్‌ విధానంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మార్కెట్‌  బాగా లేని పరిస్థితుల్లో కూడా  సిప్‌ను కొనసాగిస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ దీర్ఘకాలంలో మంచి రాబడులనిస్తాయి.

నేనొక వర్కింగ్‌ వుమెన్‌ను. నా దగ్గర ప్రస్తుతం రూ. లక్ష ఉన్నాయి. సంవత్సరం తర్వాత వీటి అవసరం నాకు ఉంటుంది. ఆలోగా మంచి రాబడులు వచ్చే దాంట్లో ఈ డబ్బులను ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఫిక్స్‌డ్‌  డిపాజిట్లు కంటే ఎక్కువ రాబడి రావాలి. అదే సమయంలో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉండాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా? లేక వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయనా? తగిన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను తెలపండి.      
–కీర్తి, విశాఖపట్టణం

మీరు షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. వీటికి లాక్‌–ఇన్‌ పీరియడ్‌  ఉండదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మంచి రాబడులనే ఇస్తాయి. ఏడాది స్వల్ప కాలానికి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి నిర్ణయం కాదు. కనీసం 3–5 ఏళ్లకు మించితేనే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి.  స్వల్పకాలానికి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే తక్కువ రాబడులు రావచ్చు. లేదా నష్టాలు వచ్చినా రావచ్చు.

నేను తొలిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నేను రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధమే. మ్యూచువల్‌ ఫండ్స్‌లో 10–15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.
–అఫ్జల్, హైదరాబాద్‌

రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, తొలిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్‌ తక్కువ రిస్క్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మార్కెట్‌  ఒడిదుడుకులకు గురైనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విలువ తగ్గే ప్రమాదం ఉంది. మీరు తొలిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి ముందుగా 2–3 ఏళ్ల పాటు బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయండి.  ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌కు మరలండి. పన్ను ప్రయోజనాలు కావాలనుకుంటే, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో ఇన్వెస్ట్‌చేయండి.

మరిన్ని వార్తలు