ధీమాగా ‘సిప్‌’ చేస్తున్నారు!

14 Nov, 2018 02:27 IST|Sakshi

మార్కెట్ల ఆటుపోట్లకు వెరవని రిటైలర్లు

అక్టోబర్‌లో పెట్టుబడులు 42% అప్‌

రూ. 7,985 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ల రాక

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులు, రూపాయి పతనం, ముడిచమురు రేట్ల పెరుగుదల మొదలైన ప్రతికూల అంశాలకు వెరవకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ పథకాల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌(సిప్‌)లో పెట్టుబడులు ఏకంగా రూ. 7,985 కోట్లకు చేరడమే దీనికి నిదర్శనం. గతేడాది అక్టోబర్‌లో నమోదైన రూ. 5,621 కోట్లతో పోలిస్తే ఇది 42 శాతం అధికం.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ. 7,727 కోట్లు వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ గణాంకాల ప్రకారం తాజా ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కలిపి.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా (ఏప్రిల్‌–అక్టోబర్‌) సిప్‌లలో పెట్టుబడుల మొత్తం రూ. 52,472 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్‌ మార్గంలో ఫండ్స్‌ రూ. 67,000 కోట్లు సమీకరించాయి.

అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఈ పెట్టుబడులు రూ. 43,900 కోట్లు. రిటైల్‌ ఇన్వెస్టర్లు సంప్రదాయ పెట్టుబడి సాధనాలైన రియల్‌ ఎస్టేట్, బంగారం కన్నా మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి ఫైనాన్షియల్‌ సాధనాలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని యాంఫీ పేర్కొంది. మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి పొంచి ఉండే రిస్కులను తగ్గించుకునేందుకు సిప్‌లను ఎంచుకుంటున్నారని తెలియజేసింది.

పెరుగుతున్న ఇన్వెస్టర్లు..
‘గడిచిన ఏడాది కాలంలో రిటైల్‌ ఫోలియోస్‌ సంఖ్య 30 శాతం, నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) పరిమాణం 14 శాతం, నెలవారీ సిప్‌ పెట్టుబడులు 40 శాతం పైగా పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌పై రిటైల్‌ ఇన్వెస్టర్లలో నెలకొన్న నమ్మకానికి ఇది నిదర్శనం‘ అని యాంఫీ సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ చెప్పారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్రస్తుతం 2.5 కోట్ల పైచిలుకు సిప్‌ ఖాతాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతి నెలా 10 లక్షల పైచిలుకు సిప్‌ ఖాతాలు వచ్చి చేరాయి.

సగటున పెట్టుబడి పరిమాణం రూ.3,200గా ఉంటోంది. యాంఫీ గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి (ఎంఎఫ్‌) నికరంగా రూ. 14,783 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం నెలలో ఈ పరిమాణం రూ. 11,251 కోట్లుగా నమోదైంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకుండా వారంవారీ, నెలవారీ, మూణ్నెల్లకోసారి చిన్న మొత్తాలను ఫండ్స్‌ ద్వారా మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉపయోగపడతాయి సిప్‌ పథకాలు. ఇవి ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేసేందుకు ఉపయోగించే రికరింగ్‌ డిపాజిట్‌ పథకాల కోవకి చెందినవి.

మరిన్ని వార్తలు