పూర్తిగా జూపల్లి చేతికి ‘మై హోమ్‌’

28 Dec, 2019 06:44 IST|Sakshi

సీఆర్‌హెచ్‌ నుంచి 50 శాతం వాటా కొనుగోలు

రూ. వెయ్యి కోట్లకు పైగా వెచ్చించిన గ్రూప్‌ సంస్థలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటిదాకా ఐర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్‌ మెటీరియల్‌ కంపెనీ సీఆర్‌హెచ్‌ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్‌ ఇండస్ట్రీస్‌’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్‌ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్, జూపల్లి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్, గ్రూప్‌ ప్రమోటరు జూపల్లి రామేశ్వరరావు కలిసి కొనుగోలు చేశారు. ఇందుకోసం వీరు దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెచ్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి గురువారం కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించింది.  

4 ప్లాంట్స్, 10 లక్షల టన్ను..: మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం ‘మహా సిమెంట్‌’ బ్రాండ్‌ పేరిట గ్రే సిమెంట్‌ తయారీ, సరఫరాలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ పాండిచ్చేరి వంటి 11 రాష్ట్రాల్లో సిమెంట్‌ సరఫరా చేస్తోంది. సుమారు 5 వేల మందికి పైగా డీలర్లు ఉన్నారు. 10 లక్షల టన్నుల వార్షిక సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సంస్థకు తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని  కర్నూల్, విశాఖ జిల్లాల్లోనూ, అదేవిధంగా తమిళనాడులో కలిపి మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇక మై హోమ్‌ గ్రూప్‌... సిమెం ట్, కన్‌స్ట్రక్షన్స్, రియల్‌ ఎస్టేట్, పవర్, కన్సల్టెన్సీ, మీడియా, ఫార్మాసూటికల్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్‌ వంటి పలు రంగాల్లో విస్తరించి ఉంది. 

మరిన్ని వార్తలు