మైలాన్‌ రెమ్‌డెసివిర్‌ వచ్చేసింది

21 Jul, 2020 08:46 IST|Sakshi

డెస్‌రెమ్‌ పేరుతో విడుదల 

వయల్‌ ధర రూ.4,800

సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌–19 చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం మైలాన్‌ భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. డెస్‌రెమ్‌ పేరుతో కంపెనీ ఈ జనరిక్‌ వర్షన్‌ను రూపొందించింది. 100 ఎంజీ వయల్‌ను రూ.4,800లకు విక్రయించనున్నట్టు మైలాన్‌ ఇప్పటికే ప్రకటించింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్‌ అనుమానిత, నిర్ధారిత కేసులు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్సలో భాగంగా పరిశోధనాత్మక యాంటీ వైరల్‌ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. తొలి బ్యాచ్‌ వయల్స్‌ను ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశపెట్టామని.. ఈ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా సరఫరాను పెంచుతామని కంపెనీ ఇండియా, ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ బమ్‌జాయ్‌ వెల్లడించారు.

ఔషధం సరఫరా వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నంబరును సైతం కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులోని ఇంజెక్టేబుల్‌ ఫెసిలిటీలో డెస్‌రెమ్‌ను మైలాన్‌ తయారు చేస్తోంది. ఈ ఔషధాన్ని ఇతర దేశాలకూ ఎగుమతి చేయనున్నట్టు సంస్థ తెలిపింది. రెమ్‌డెసివిర్‌ తయారీ, పంపిణీకై ఈ ఏడాది మే నెలలో యూఎస్‌కు చెందిన గిలియడ్‌ సైన్సెస్‌తో నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో మైలాన్‌ కూడా ఉంది. హెటిరో, సిప్లా ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చాయి.

మరిన్ని వార్తలు