డెస్క్ టాప్ సేవల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మింత్ర

4 May, 2016 15:03 IST|Sakshi
డెస్క్ టాప్ సేవల్లోకి మింత్ర రీ ఎంట్రీ

బెంగళూరు :  ఫ్యాషన్ ఈ-కామర్స్ రిటైలర్ మింత్ర, తన డెస్క్ టాప్ సైట్ సేవలను జూన్ 1నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. వ్యాపారమంతా అరచేతిలోనే అన్న మాదిరిగా మారిన తర్వాత మింత్ర తన డెస్క్ టాప్ సేవలను రద్దుచేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం వరకూ అమ్మకాలు డెస్క్ టాప్ వెబ్ సైట్ ద్వారానే జరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం మొబైల్ ద్వారానే సేవలు అందించే వ్యూహాన్ని కాకుండా, డెస్క్ టాప్ ద్వారా కూడా తన సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. డెస్క్ టాప్ సేవలను పునరుద్ధరించి, ఈ వెబ్ సైట్ కోల్పోయిన కస్టమర్లను మళ్లీ వెనక్కి తెచ్చుకుంటామని, బిజినెస్ ను పెంచుకుంటామని పేర్కొంది.

కస్టమర్ల అవసరాలను వినయపూర్వకంగా వినడం, తెలుసుకోవడం తమ బాధ్యత అని మింత్ర సీఈవో అనంత్ నారాయణన్ తెలిపారు. కస్టమర్ల అవసరాల మేరకు జూన్ 1నుంచి ఈ సేవలను పునఃప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. డెస్క్ టాప్ సేవలు కస్టమర్లను ఆకట్టుకోవడంలో మింత్ర సంస్థకు ఎంతో సహాయపడుతుందని, అదనంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా నష్టాలను అధిగమించగలుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

గత ఆర్తిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించుకున్న 100 కోట్ల డాలర్ల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని, డెస్క్ టాప్ సేవలతో ఈ మైలురాయిని 2017 మార్చి వరకూ చేరుకుంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కేవలం డెస్క్ టాప్ వెర్షన్ తోనే కాకుండా వేరే డామినెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకుని తన సేవలను పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రపంచమే అరచేతిలోకి వచ్చాక, కొనాలనుకున్నది మొబైల్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు క్షణాల్లో మన ముంగిట్లో ఉంటుంది. దీంతో చాలా ఈ-కామర్స్ సంస్థలు డెస్క్ టాప్ సేవలకు స్వస్తి పలికి, మొబైల్ యాప్ ద్వారాత సేవలందిస్తున్నాయి.

మరిన్ని వార్తలు