15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌.. ఎన్‌కే సింగ్‌

28 Nov, 2017 01:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్‌కే సింగ్‌ 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం సహా పలు అంశాలను 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సమీక్షిస్తుంది. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలను కమిషన్‌ పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. అక్టోబర్‌ 2019 నాటికి కమిషన్‌ తన నివేదికను సమర్పిస్తుంది. మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ అశోక్‌ లాహిరి, నీతీ ఆయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్, జార్జిటౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అనూప్‌ సింగ్‌లు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ 2020 ఏప్రిల్‌ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలంపై దృష్టి సారిస్తుంది. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ 2013 జనవరి 2న ఏర్పాటయ్యింది. 2015 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకూ సంబంధించిన కాలానికి ఈ కమిషన్‌ సిఫారసులు చేసింది.   

మరిన్ని వార్తలు