నాల్కో లాభం 129 శాతం వృద్ధి

13 Nov, 2018 00:53 IST|Sakshi

అల్యూమినియమ్‌ దిగ్గజం, ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ (నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.510 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.235 కోట్లతో పోలిస్తే 129 శాతం వృద్ధి సాధించామని నాల్కో తెలిపింది. నిర్వహణ లాభం రూ.223 కోట్ల నుంచి 229 శాతం వృద్ధితో రూ.725 కోట్లకు చేరుకుంది.

ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండు క్వార్టర్లను పరిగణనలోకి తీసుకుంటే టర్నోవర్‌ 42 శాతం వృద్ధితో రూ.5,952 కోట్లకు, నికర లాభం 229 శాతం వృద్ధితో రూ.1,197 కోట్లకు పెరిగాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు క్వార్టర్లలో రూ.334 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండు క్వార్టర్లలో నాలుగు రెట్లు పెరిగి రూ.1,624 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్‌ 17 శాతం నుంచి రెట్టింపై 34 శాతానికి పెరిగిందని పేర్కొంది.  

‘‘అమెరికా వాణిజ్య ఆంక్షల కారణంగా అల్యూమినా, అల్యూమినియమ్‌ ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ, పనితీరు చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపడింది. ఏడాది క్రితం మేం ఆరంభించిన కొత్త వ్యాపార విధానమే దీనికి కారణం. ఈ విధానంలో భాగంగా వ్యయాల నియంత్రణ, ఉత్పత్తి పెంపు, స్పాట్‌ మార్కెట్లలో వ్యూహాత్మక మార్కెటింగ్‌ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం’’ అని నాల్కో వివరించింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత నాల్కో ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో నాల్కో షేర్‌ 1.2 శాతం క్షీణించి రూ.69.45 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు