ఇన్ఫో @ నీలేకని

25 Aug, 2017 01:04 IST|Sakshi
ఇన్ఫో @ నీలేకని

మళ్లీ సొంతగూటికి... చైర్మన్‌గా పగ్గాలు
ప్రస్తుత చైర్మన్‌ శేషసాయి, కో–చైర్మన్‌ రవి రాజీనామా
బోర్డు నుంచి కూడా తప్పుకున్న విశాల్‌ సిక్కా
స్వతంత్ర డైరెక్టర్లుగా వైదొలిగిన జెఫ్రీ, జాన్‌
కొత్త సీఈవో కోసం కొనసాగనున్న అన్వేషణ  


న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా వ్యవస్థాపకులు, బోర్డుకు మధ్య విభేదాలతో నలిగిపోయిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కి కాస్త ఊపిరి తీసుకునే అవకాశం దొరికింది. సంక్షోభ పరిస్థితులకు తెరదించుతూ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని సొంత గూటికి మళ్లీ తిరిగొచ్చారు. ఇతర సహ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి కంపెనీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న ఆర్‌.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తారు. గురువారం బోర్డు సమావేశం అనంతరం ఇన్ఫోసిస్‌ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. రవి వెంకటేశన్‌ సహ–చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

ఆయన ఇకపై స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఇక గతవారం సీఈవో పదవికి రాజీనామా చేసినా.. వారసుడి ఎంపిక దాకా వైస్‌–చైర్మన్‌గా కొనసాగుతున్న విశాల్‌ సిక్కా.. తాజాగా బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు జెఫ్రీ ఎస్‌ లేమాన్, జాన్‌ ఎచ్‌మెండీ కూడా బోర్డు నుంచి వైదొలిగారు. ఆయా అధికారుల రాజీనామాలను ఆమోదించినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. తాత్కాలిక సీఈవోగాను, ఎండీగాను యూబీ ప్రవీణ్‌ రావు కొనసాగుతారు. పూర్తి స్థాయి కొత్త సీఈవో కోసం అన్వేషణ కొనసాగనుంది. తాజా పరిణామాలను వివరించేందుకు ఆగస్టు 25న (ఇవాళ) ఇన్వెస్టర్లతో సమావేశం అవుతున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపించిందని, ఇన్ఫోసిస్‌ ప్రక్షాళన జరగాలంటూ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తదితరుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవస్థాపకులు పదే పదే తనను టార్గెట్‌ చేసుకుంటున్నారని పరోక్షంగా ఆరోపిస్తూ సిక్కా అర్ధంతరంగా సీఈవో పదవికి గత వారం రాజీనామా చేసినప్పటి నుంచి ఇన్ఫీ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. చైర్మన్‌గా నీలేకని నియామకం వార్తలతో అమెరికా నాస్‌డాక్‌లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.74 శాతం ఎగిసింది. 14.93 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.

నెలలుగా సంక్షోభం..
ఆరేడు నెలలుగా ఇన్ఫీలో సంక్షోభం చెలరేగుతోంది. సహవ్యవస్థాపకులు.. ముఖ్యంగా నారాయణ మూర్తికి, బోర్డుకు మధ్య విభేదాలు అంతకంతకూ ముదిరాయి. ఇజ్రాయెల్‌ సంస్థ పనయా కొనుగోలు వ్యవహారం మొదలు అనేక అంశాల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపించిందంటూ మూర్తి పలు సందర్భాల్లో బోర్డును తప్పుపట్టారు. బోర్డు, మూర్తి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం బహిరంగంగానే కొనసాగింది. ఈ పరిణామాల నడుమ.. ఇన్ఫీ చరిత్రలో సీఈవోగా నియమితుడైన తొలి వ్యవస్థాపకయేతర వ్యక్తి విశాల్‌ సిక్కా ఆగస్టు 18న రాజీనామా చేశారు. అసలు బాధ్యతలపై దృష్టి పెట్టనివ్వకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు పెరిగిపోతుండటం ఇందుకు కారణంగా ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

 సిక్కా రాజీనామాకు వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి నిరంతరాయంగా ఆరోపణలు గుప్పిస్తుండటమే కారణమంటూ ఇన్ఫోసిస్‌ బోర్డు.. స్టాక్‌ ఎక్సే్చంజీలకు రాసిన ఈ–మెయిల్‌లో ఆరోపించింది. ఈ పరిణామంపై మండిపడిన నారాయణమూర్తి.. బోర్డు ఆరోపణలు ఖండించారు. ఇన్వెస్టర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు మూర్తి ప్రకటించినప్పటికీ.. అది వాయిదా పడింది. సిక్కా రాజీనామా అనంతరం నీలేకనికి బాధ్యతలు అప్పగించాలంటూ ఇన్వెస్టర్లతో పాటు ఇన్ఫీలో గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు మాజీ సిబ్బంది నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో నీలేకని తిరిగి వెనక్కి రావడానికి అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సిక్కాతో తెగదెంపులు..
నందన్‌ నీలేకని తిరిగి రావడం ఖరారైన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌.. సిక్కాతో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకోనుంది. కాంట్రాక్టు ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిన పరిహారాన్ని చెల్లించేయనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. ఆయనకు 90 రోజులకి సంబంధించి బేస్‌ పేతో పాటు ఉద్యోగులకు లభించే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని పేర్కొంది. ఇప్పటిదాకా షేర్ల రూపంలో ఆయనకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లించనున్నట్లు వివరించింది.

ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో
ఒకరైన నందన్‌ నీలేకని 2002–2007 మధ్య కాలంలో సంస్థ సీఈవోగా పనిచేశారు. ఆ తర్వాత విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ ఆధార్‌కు సారథ్యం వహించేందుకు 2008లో వైదొలిగారు. నీలేకని సీఈవోగా వ్యవహరించిన 2002 మార్చి 2007 ఏప్రిల్‌ మధ్య కాలంలో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ ఏకంగా 374 శాతం ఎగిసింది. పరిశ్రమను మించిన పనితీరు కనపర్చింది. అమ్మకాలు 40%, లాభాలు వార్షికంగా 37 శాతం మేర వృద్ధి చెందాయి.

సొంతగూటికి రాక సంతోషం: నీలేకని
ఇన్ఫోసిస్‌కి మళ్లీ తిరిగిరావడం సంతోషంగా ఉంది. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాను. క్లయింట్లు, షేర్‌హోల్డర్లు, ఉద్యోగులు మొదలైన వారందరికీ ప్రయోజనాలు చేకూర్చేలా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా బోర్డులోని నా సహచర సభ్యులతో కలసి పనిచేస్తాను. గడిచిన మూడేళ్లుగా సీఈవోగా సేవలు అందించిన విశాల్‌కి కృతజ్ఞతలు. ఆయన భవిష్యత్‌లో చేపట్టే వాటిల్లోనూ రాణించాలని కోరుకుంటున్నాను.

స్వాగతిస్తున్నా..: విశాల్‌ సిక్కా
నందన్‌ నీలేకని నియామకాన్ని స్వాగతిస్తున్నా. బాధ్యతల బదలాయింపు జరిగే వరకూ బోర్డులో కొనసాగుతానని గతంలో చెప్పా. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన రాకతో తక్షణం వైదొలుగుతున్నా. నందన్‌ సమర్థుడైన నాయకుడు. ఇన్ఫోసిస్‌ కొత్త శిఖరాలు అధిరోహించేలా మార్గనిర్దేశం చేసే దిశగా నీలేకని నియామకాన్ని స్వాగతిస్తున్నా. ఆయనతో పాటు ప్రవీణ్, ఇతర ఇన్ఫోసియన్లు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

సమర్ధ నాయకుడు నీలేకని..: శేషసాయి
ఇన్ఫోసిస్‌ను వృద్ధి పథంలో నడిపించేందుకు నీలేకని సమర్ధుడైన నాయకుడు. భవిష్యత్తు వ్యూహాలపై కంపెనీ దృష్టి పెట్టేందుకు ఆయన నియామకం దోహదపడగలదు. నీలేకని సారథ్యంలో కంపెనీ మేనేజ్‌మెంట్‌ బృందం సమిష్టిగా పనిచేసి.. ఇన్ఫోసిస్‌ను పరిశ్రమలో అగ్రస్థానానికి చేర్చగలదనడంలో సందేహం లేదు.

మరిన్ని వార్తలు