ఇన్ఫీకి నీలేకని జోష్‌..!

29 Aug, 2017 00:13 IST|Sakshi
ఇన్ఫీకి నీలేకని జోష్‌..!

♦  ఆయన రాకతో శుభారంభం
సీఎల్‌ఎస్‌ఏ వ్యాఖ్యలు
సీఈవో ఎంపిక ప్రక్రియ జోరు...  
వ్యూహాల పునఃసమీక్ష సానుకూలాంశాలు


న్యూఢిల్లీ: వివాదాల నుంచి బైటపడే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని చైర్మన్‌గా రావడం కంపెనీకి ఊతమివ్వగలదని బ్రోకింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఇది సంస్థకు శుభారంభం ఇవ్వగలదని పేర్కొంది. సుస్థిరమైన నాయకత్వం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవడం, కంపెనీ సంస్కృతిపరమైన వివాదాల పరిష్కారం మొదలైన అంశాల దిశగా ఇన్ఫీ తలపెట్టే చర్యలకు సంబంధించి గత ఆరేళ్లలో కంపెనీకి లభించిన అత్యుత్తమ శుభారంభం ఇదే కాగలదని  సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది.

 వ్యవస్థాపకులు, బోర్డు మధ్య విభేదాల నేపథ్యంలో సీఈవో విశాల్‌ సిక్కా వైదొలగడం, పరిస్థితులు చక్కదిద్దేందుకు నందన్‌ నీలేకని పునరాగమనం తదితర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్‌.. ఇప్పటికే సీఈవో ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారని, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాలను పునఃసమీక్షించడం మొదలుపెట్టడం తదితర అంశాలు సానుకూల ధోరణిలో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపర్చాయని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ‘ఇన్ఫీ వ్యూహాల దిశ మారనుండటం, మెరుగైన నాయకత్వం, తక్కువ వేల్యుయేషన్‌ తదితర అంశాల కారణంగా రిస్కులతో పోలిస్తే రివార్డులు గణనీయంగా మెరుగుపడగలవు’ అని పేర్కొంది.  

మరోవైపు, ఇన్ఫోసిస్‌కు దార్శనికత గల సీఈవో అవసరమని పరిశ్రమ నిపుణుడు గణేష్‌ నటరాజన్‌ తెలిపారు. సదరు సీఈవోకి టెక్నాలజీ నైపుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదని.. ఇటు బోర్డును.. అటు ఒత్తిడి చేసే వర్గాలను సైతం మెప్పిస్తూ, కంపెనీని ముందుకు తీసుకెళ్లే సత్తా కూడా ఉండాలని ఆయన చెప్పారు.  

బైబ్యాక్‌లో ప్రమోటర్లు కూడా..
ఇన్ఫోసిస్‌ ప్రతిపాదిత బైబ్యాక్‌ ఆఫర్‌లో తమ షేర్లను కూడా విక్రయించాలని కంపెనీ ప్రమోటర్లు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు ప్రమోటర్లు తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఇన్ఫోసిస్‌ తెలిపింది. అయితే, ఆయా ప్రమోటర్ల పేర్లు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తదితర సహ వ్యవస్థాపకులకు ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో 12.75 శాతం వాటాలు ఉన్నాయి. వ్యవస్థాపకుల నుంచి వేధింపుల కారణంతో సీఈవో హోదా నుంచి సిక్కా వైదొలిగిన మరుసటి రోజే ఇన్ఫోసిస్‌ బోర్డు సుమారు రూ. 13,000 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌కి ఆమోదముద్ర వేసింది. షేరు ఒక్కింటికి రూ. 1,150 చొప్పున మొత్తం రూ. 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. ఈ ప్రతిపాదనకు ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్‌హోల్డర్లు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉన్నట్లు కంపెనీ వివరించింది.

మరిన్ని వార్తలు