‘ఏఐ’తో ఐటీ ఉద్యోగాలకు ముప్పేమీ లేదు...

25 Dec, 2017 02:25 IST|Sakshi

దీన్ని మరీ అతిగా చూపుతున్నారు...

సీనియర్లు ఇష్టానుసారంగా జీతాలు పెంచుకోవడం సబబుకాదు

ఇన్ఫీ  నారాయణ మూర్తి వ్యాఖ్యలు

ముంబై: ఐటీ రంగంలో జీతాల తేటెతుట్టెను ఇన్ఫీ నారాయయణ మూర్తి మరోసారి కదిపారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి సమయంలో మేనేజ్‌మెంట్‌ స్థాయిలోని సీనియర్‌ ఉద్యోగులు తమ వేతనాలను భారీగా పెంచుకోవడం ఆమోదయోగ్యం కాదని మూర్తి పేర్కొన్నారు. ఐఐటీ–బాంబేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థపై(క్యాపిటలిజం) సామాన్యులకు నమ్మకాన్ని పెంపొందించాలంటే... సీనియర్లు తమ జీతాల విషయంలో త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), యాంత్రీకరణ(ఆటోమేషన్‌) కారణంగా పరిశ్రమలో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలను తోసిపుచ్చారు. ఐటీనే తీసుకుంటే... వాస్తవాలను పక్కనబెట్టి వీటిని మరీ అతిగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ‘జూనియర్‌ ఉద్యోగులకు జీతాలను పెంచకపోవడం ఆందోళనకలిగిస్తోంది. మరోపక్క, సీనియర్ల జీతాలు  భారీగా పెరుగుతుండటం శ్రేయస్కరం కాదు. ఇలాంటి ధోరణులతో పెట్టుబడిదారీ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించలేం. దేశంలో కోట్లాదిమంది ప్రజలు పేదరికంలో ఉన్నారని మరవొద్దు’ అని మూర్తి పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌ మాజీ సీఈఓ విశాల్‌సిక్కా, ఇతరత్రా కొందరు సీనియర్లకు భారీ వేతన ప్యాకేజీల విషయంలో మూర్తి గతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం.. సిక్కా వైదొలగడం తెలిసిందే.

ఐటీలో సమస్యలు తాత్కాలికమే...: ప్రస్తుతం ఐటీ రంగం కష్టకాలంలో ఉందని మూర్తి అంగీకరించారు. అయితే, కొన్నేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు నెలకొనడం(సైక్లికల్‌) సాధారణమేనని.. పరిశ్రమ మళ్లీ గాడిలోపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన కంపెనీలు మన ఐటీ రంగానికి ప్రధానమైన క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు మళ్లీ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందు ఇప్పటివరకూ వెచ్చించినదానిపై ప్రయోజనాల కోసం వేచిచూస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఐటీ పరిశ్రమ మందగమనాన్ని చవిచూడాల్సి వస్తోంది’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు