ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోతకు పరిష్కారమిదే...

1 Jun, 2017 15:30 IST|Sakshi
ఇలా చేస్తే ఉద్యోగాల కోతకు చెక్
బెంగళూరు : దేశీయ ఐటీ పరిశ్రమ ఇటీవల ఉద్యోగాల కోతతో తీవ్రంగా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ వీసా విధానాలు, ఆటోమేషన్, వ్యయాల భారం వంటి కారణాలతో  ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. అయితే ఉద్యోగులపై వేటు వేయకుండా.. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐటీ కంపెనీలకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓ సలహా ఇచ్చారు.
 
సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు చెల్లించే వేతనాల్లో కోతపెడితే, యువతరం ఉద్యోగులను కాపాడవచ్చని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చెప్పారు. భారతీయ ఐటీ పరిశ్రమ ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొనడం ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఐటీ పరిశ్రమ చాలాసార్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. పరిశ్రమ నాయకులందరూ కలిసి మంచి ఉద్దేశ్యంతో  ఈ సమస్యను పరిష్కరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తంచేశారు. 
 
'' ఇండస్ట్రీలో చాలామంది తెలివైన నాయకులున్నారు. వారందరికీ మంచి ఉద్డేశ్యాలే ఉన్నాయి. వారు పరిష్కారం కనుగొంటారు'' అని ఉద్యోగాల కోతపై ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉద్యోగుల తొలగింపు సమస్యను ఎదుర్కోవడం ఇదేమీ తొలిసారి కాదని, 2008, 2001లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా ఆందోళన చెందాల్సినవసరం లేదని, ఇలాంటి సమస్యలకు మన దగ్గర పరిష్కారం ఉంటుందని చెప్పారు.
 
ఈ సందర్భంగానే లేఆఫ్స్ సమస్యను  ఎలా పరిష్కరించాలో కూడా ఓ ఉదాహరణతో వివరించారు. సీనియర్ యాజమాన్యం స్థాయి ఎగ్జిక్యూటివ్ లు వేతనాలు తగ్గిస్తే, యువతరం ఉద్యోగులను కాపాడవచ్చని సూచించారు. 2001లో ఇన్ఫోసిస్ ఇదే పద్ధతిని అవలంభించిందని తెలిపారు.
 
2001లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో యువతరం ఉద్యోగాలను కాపాడేందుకు తమ వేతనాల్లో కొంత త్యాగం చేశామని చెప్పారు.  సీనియర్ మేనేజ్ మెంట్ స్థాయిలో అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  ఉద్యోగుల తొలగింపుపై మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా యువ ఉద్యోగులకు శిక్షణ శిబిరాలను నిర్వహించి.. నేర్చుకోవడానికి సమయం ఇవ్వాలని చెప్పారు. అంతేతప్ప ఉద్యోగులను భయపెట్టడం మంచివిధానం కాదన్నారు.
మరిన్ని వార్తలు