ఇన్ఫీ ఆదాయాన్ని మూర్తి పెంచారు: కామత్

28 Jun, 2014 00:58 IST|Sakshi
ఇన్ఫీ ఆదాయాన్ని మూర్తి పెంచారు: కామత్

విశాల్ మరింత వృద్ధి సాధిస్తారని వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఆదాయాన్ని పెంచడంలో కంపెనీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సఫలీకృత ం అయ్యారని నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన విశాల్ శిక్కా భవిష్యత్‌లో కంపెనీని మరింత వృద్ధిబాటన నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈవో శిబూలాల్ నుంచి శిక్కా ఆగస్ట్‌లో బాధ్యతలను స్వీకరించనున్నారు. కంపెనీ వ్యవస్థాపకులు లేదా ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాకుండా ఇతర సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఇన్ఫోసిస్ సీఈవోగా ఎంపిక చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం.
 
కాగా, ఇన్ఫీని గాడిలో పెట్టేందుకు రెండోసారి అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణమూర్తి అమ్మకాలు పెంచడంపై దృష్టిపెట్టారని, ఇకపై శిక్కా ఈ ఎజెండాను ముందుకు తీసుకువెళతారని కామత్ వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మూర్తి పదవీ బాధ్యతలను చేపట్టిన విషయం విదితమే. సానుకూల ధృక్పథంతోనే విజయాలను సాధించగలమని, ఇన్ఫోసిస్‌ను తాను ఈ దృష్టితోనే చూస్తానని చెప్పారు. నారాయణమూర్తి ఈ నెల 14న ఇన్ఫోసిస్‌ను వీడారు. 1981లో ఆవిర్భవించిన ఇన్ఫోసిస్ 8 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) కంపెనీగా నిలిచింది.

మరిన్ని వార్తలు