ఈ కార్పొరేట్‌ దిగ్గజాలకు నెటిజన్లు ఫిదా

29 Jan, 2020 18:43 IST|Sakshi

మొన్న టాటా ఫోటోకు ఫిదా, నేడు మూర్తి ఫోటో వైరల్‌

ట్రైకాన్ అవార్డుల కార్యక్రమంలో రతన్‌ టాటా, నారాయణమూర్తి

జీవనకాల సాఫల్య పురస్కారాన్ని  ప్రదానం చేసిన నారాయణమూర్తి

టాటాకు నారాయణ మూర్తి పాదాభివందనం , నెటిజన్ల ప్రశంసలు

సాక్షి, ముంబై : వాళ్లిద్దరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వృత్తిపరంగా ప్రత్యర్థులైన ఈ కార్పొరేట్‌ దిగ్గజాలు వ్యక్తులుగా మంచి స్నేహితులు కూడా.  తాజాగా అంతకుమించి తమ మర్యాద పూర్వక ప్రవర్తనతో పలువురికి  స్పూర్తిగా నిలిచారు.  ఒకరు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ స్వామి(73) కాగా, మరొకరు టాటా అధినేత రతన్‌ టాటా  (82). మొన్న టాటా ఫోటోకు నెటిజన్లు ఫిదా అవ్వగా,  కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు ప్రాణమిచ్చే  ఇన్ఫీ నారాయణ మూర్తి  ఫోటోలు తాజాగా వైరలవుతున్నాయి.  ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు జనవరి 28 న జరిగిన ట్రైకాన్ ముంబై 2020, 11వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. 

రతన్‌టాటాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించిన వెంటనే తన కంటే వయసులో పెద్దవారైన టాటాకు నారాయణ మూర్తి ఆయనకు పాదాభివందనం చేశారు. గొప్ప స్నేహితుడైన నారాయణ మూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలను, వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు రతన్ టాటా. దీంతో నారాయణమూర్తి మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్నారు. రతన్ టాటాకు పాదాభివందనం చేసి నారాయణమూర్తి తన విధేయతను చాటుకున్నారని కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో  పలువురిని అబ్బుర పరుస్తున్నాయి.

రెండు అతిపెద్ద ప్రత్యర్థి సంస్థలు, ఇద్దరు అత్యంత వినయపూర్వకమైన వ్యాపారవేత్తలు, ముఖ్యంగా నారాయణ మూర్తి రతన్ టాటా పాదాలను తాకడం అపూర్వం. ఇంటర్నెట్‌లో ఇది ఉత్తమమైందం​టూ ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించారు. టాటా ఆశీర్వాదం కోసం ఆయన పాదాలను తాకడం నారాణమూర్తి వ్యక్తిత్వానికి  నిదర్శనమని మరొకరు ట్వీట్‌ చేశారు. పిల్లల్లో ఇలాంటి గొప్ప సంస్కృతిని జీర్ణింప చేయాల్సిన అవసరం చాలా వుందని ఒక తండ్రిగా తాను భావిస్తున్నానన్నారు. కాగా ఇటీవల రతన్‌ టాటా తాను యువకుడిగా ఉన్నప్పటి అద్భుతమైన ఫోటోను షేర్‌ చేసి పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 
 

>
మరిన్ని వార్తలు