10వ తేదీ నుంచి బడ్జెట్‌ తయారీ ప్రక్రియ

5 Jun, 2019 09:23 IST|Sakshi

జూలై 5న మోదీ సర్కారు బడ్జెట్‌

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. సోమవారం నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ఆర్థికమంత్రిత్వశాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌ ముద్రణ కార్యకలాపాలు సోమవారంనాడు ప్రారంభంకానున్నాయి. నాటి నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో పాల్గొననున్న అధికారులకు జూలై 5వ తేదీ వరకూ  బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా సంబంధాలు తెగిపోనున్నాయి. ఇటీవల జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ, ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ నేతృత్వంలోని తాజా బడ్జెట్‌ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌ ఉన్నారు. ఫైనాన్స్‌ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ నేతృత్వంలోని అధికారుల బృందంలో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్‌ చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్‌ చక్రవర్తి, ఫైనాన్స్‌ సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు ఉంటారు. కొత్తగా ఎన్నికైన 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్‌ 17 నుంచి జూలై 26వ తేదీ వరకూ జరుగుతాయి. 2018–19 ఆర్థిక సర్వేను జూలై 4న ఆర్థికమంత్రి ప్రవేశపెడతారు. ఆ తదుపరిరోజు 2018–19 పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచుతారు.

మరిన్ని వార్తలు