మోడీ సర్కారుపై 'రియల్' ఆశలు!

29 May, 2014 01:39 IST|Sakshi
మోడీ సర్కారుపై 'రియల్' ఆశలు!

ముంబై: దేశంలో సుస్థిరమైన మోడీ సర్కారు కొలువుదీరడంతో... ఇక ప్రభుత్వం తీసుకోబోయే సత్వర చర్యలపైనే అందరి దృష్టీ నెలకొంది. ప్రధానంగా తీవ్ర ఇబ్బందులతో నెట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం తమ రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తుందని.. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మళ్లీ 8-9 శాతానికి చేరేందుకు దోహదపడుతుందని రియల్టీ సంస్థలు కొండంత విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

రియల్టీలో సంస్కరణలకు బాటలు వేయడంతోపాటు బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పినవిధంగా ఎనిమిదేళ్లలో అందరికీ సొంతింటి కల హామీని నెరవేర్చేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ పేర్కొన్నారు. గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖలను కలిపేయడం వల్ల మరింత సమన్వయం, పూర్తిస్థాయిలో నియంత్రణకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సామాన్యుడికి గృహయోగం...
దేశంలోని సామాన్యులందరికీ సొంత ఇంటి కల త్వరలో సాకారం అయ్యే అవకాశం ఉందని రియల్టీ రీసెర్చ్ సంస్థ జోన్స్ లాంగ్ లాసల్లే ప్రతినిధి సంతోష్ కుమార్ అంటున్నారు. మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చౌక గృహాలు, నిర్మాణ ప్రాజెక్టుల జాప్యాలు తగ్గించడం, లిటిగేషన్ల కారణంగా ప్రాజెక్టులు నిలిచిపోకుండా చూడటం వంటి అంశాలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. వీటికి తగిన పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వృద్ధి మందగమనానికి కారణమవుతున్న ఆటంకాలను తొలగించి, విధానపరమైన జడత్వాన్ని పటాపంచలు చేయడంలో మోడీ ప్రభుత్వం సఫలీకృతం అవుతుందనేది ఆయన అభిప్రాయం.

 రియల్టీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తే ఈ రంగానికి గొప్ప చేయూతనిచ్చినట్లేనని.. అదేవిధంగా విదేశీ నిధుల ప్రవాహం కారణంగా రూపాయి విలువ కూడా బలపడుతుందని సంతోష్ కుమార్ చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఆశావహ దృక్పథం బలపడుతోందన్నారు. ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐలు రెండింటిద్వారా గతేడాది 29 బిలియన్ డాలర్ల నిధులు దేశంలోకిరాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 60 బిలియన్ డాలర్లకు ఎగబాకవచ్చనేది ఆయన అంచనా.

 విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవాలి...
 ‘రియల్టీ సంస్థల్లో 49 శాతం వరకూ విదేశీ పెట్టుబడులకు అనుమతించేలా పట్టణాభివృద్ధి శాఖ ప్రస్తుతం నియంత్రణలను సడలిస్తుందని భావిస్తున్నాం. దీనివల్ల తక్కువ వ్యయంతో విదేశీ నిధుల సమీకరణకు దోహదం చేస్తుంది. అదేవిధంగా పట్టణాభివృద్ధి, మురికివాడలకు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ విదేశీ పెట్టుబడుల విషయంలో నియంత్రణలు తొలగుతాయని అంచనావేస్తున్నాం’ అని జైన్ వ్యాఖ్యానించారు.

దేశంలో భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి గృహనిర్మాణ రంగం ఇంధనంగా పనిచేస్తుందని జైన్ పేర్కొన్నారు. అనుమతుల్లో సింగిల్ విండో విధానం, గృహనిర్మాణ రంగంపై ఆర్‌బీఐ దృ క్పథంలో మార్పుతో పాటు భూసేకరణ విధానంలో సంతులన ధోరణి అత్యంత ఆవశ్యకమని ఆయన చెప్పారు. దీనివల్ల అటు డెవలపర్లు, ఇటు రైతులు ఇరువురికీ మేలు చేకూరుతుందనేది ఆయన వాదన.
 
వెంకయ్య వ్యాఖ్యలతో...

హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ కొత్త మంత్రిగా సీనియర్ బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడుని నియమించడంపట్ల క్రెడాయ్ హర్షం వ్యక్తం చేసింది. మోడీ ప్రభుత్వంలో రియల్టీ, ఇన్‌ఫ్రా రంగానికి అత్యధిక ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నట్లు జైన్ చెప్పారు. కాగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంకయ్య తొలి పలుకులు రియల్టీ రంగంలో ఆశలు పురిగొల్పేలా చేసింది.

2020కల్లా  అందరికీ సొంతింటి కలను సాకారం చేయడం, గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గింపు తన తొలి ప్రాధాన్యాలని చెప్పారు. రేట్ల తగ్గింపుకోసం త్వరలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. దేశంలో కొత్త 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలు కూడా తాను చేయబోయే పనుల ఎజెండాలో ఉన్నాయంటూ వెంకయ్య చెప్పడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు