జెట్‌ ఎయిర్‌వేస్‌: మరో షాకింగ్‌ న్యూస్‌

15 Jun, 2019 11:58 IST|Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫౌండర్‌ నరేష్‌ గోయల్‌కు సమన్లు

రూ. 650 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు

దుబాయ్‌లోని అనుబంధ సంస్థ ద్వారా లావాదేవీలు

సాక్షి, ముంబై : అప్పుల ఊబిలో కూరుకు పోయి కార్యకలాపాలను నిలిపివేసిన  ప్రయివేటు రంగవిమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి మరో షాకింగ్‌ న్యూస్‌​ వెలుగులోకి వచ్చింది.  కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లుగా జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థపాకుడు నరేష్‌ గోయల్‌ మీద తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి.  భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది.

రూ. 650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నరేష్‌ గోయల్‌ను ప్రశ్నించబోతోందని తాజా మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. పన్నులు ఎగవేసేందుకు నరేష్‌ గోయల్‌  దుబాయ్‌లోని దాని గ్రూప్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డంతోపాటు, ఇందుకు దుబాయ్‌ కంపెనీకి కమిషన్‌ ముట్టినట్టుగా అసెస్‌మెంట్ వింగ్ దర్యాప్తులో తేలింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా  నరేష్‌ గోయల్‌ను ఆదేశించింది.

త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగిందని ఆదాయపు పన్ను అధికారి చెప్పారు. పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో చేసిన అధిక చెల్లింపులు అనే కోణంలో అసెస్‌మెంట్ వింగ్ విచారణ అనంతరం, మరింత  వివరణ కోరేందుకు ఆయన్ను పిలిపించనున్నట్టు మరో అధికారి  అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.

కాగా 2018 సెప్టెంబర్‌లో జెట్ ముంబై కార్యాలయాంలో దాడులు, కొన్నికీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై  దర్యాప్తు ఫిబ్రవరిలో పూర్తయింది. అయితే ఫిబ్రవరిలో వెలువడిన ఈ నివేదికపై స్పందించిన జెట్‌ఎయిర్‌వేస్‌ అవకతవకల ఆరోపణలను ఖండించింది. లావాదేవీలన్నీచట్ట ప్రకారం, నియంత్రణ, కార్పొరేట్ పాలన అవసరాలకు లోబడే ఉన్నాయంటూ వివరణ ఇచ్చిన సంగతి  తెలిసిందే.

మరిన్ని వార్తలు