కోవిడ్‌-19లోనూ కొత్త శిఖరానికి నాస్‌డాక్‌

5 Jun, 2020 10:00 IST|Sakshi

రికార్డ్‌ గరిష్టం నుంచి చివర్లో డీలా

అటూఇటుగా డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ

నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌

ఈసీబీ 1.35 ట్రిలియన్‌ యూరోల ప్యాకేజీ

లక్షల సంఖ్యలో ప్రజలకు కోవిడ్‌-19 ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నప్పటికీ అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ గురువారం సరికొత్త రికార్డును అందుకుంది. తొలుత 9,716ను అధిగమించడం ద్వారా ఈ ఫీట్‌ను సాధించింది. అయితే నిరుద్యోగ గణాంకాలు, వచ్చే వారం ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశాల నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివర్లో వెనకడుగు వేసింది. వెరసి 11 పాయిం‍ట్లు(0.7 శాతం) క్షీణించి 9,616 వద్ద ముగిసింది. ఇక డోజోన్స్‌ 11 పాయింట్లు(0.1 శాతం) బలపడి 26,282 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 42 పాయింట్లు(0.3 శాతం) నీరసించి 3,112 వద్ద స్థిరపడింది. గత వారం అంచనాలకంటే అధికంగా 1.85 మిలియన్లమంది నిరుద్యోగ భృతికి క్లెయిమ్‌ చేసుకున్నట్లు వెలువడిన వార్తలు కొంతమేర సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు.

బౌన్స్‌బ్యాక్‌ ఇలా
కరోనా వైరస్‌ భయాలతో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 23కల్లా 30 శాతం పతనమైన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఆపై వేగంగా రికవర్‌అయ్యింది. ఫలితంగా కనిష్టాల నుంచి 43 శాతం ర్యాలీ చేసింది. వెరసి గురువారం ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు అమెజాన్‌, పెప్సీకో, కాస్ట్‌కో, పేపాల్‌ తదితర కౌంటర్లు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మార్చి కనిష్టం నుంచి అమెజాన్‌ 30 శాతం, పెప్సీకో 24 శాతం చొప్పున జంప్‌చేయగా.. కాస్ట్‌కో 8 శాతం బలపడింది. పేపాల్‌ 81 శాతం ర్యాలీ చేసింది. కాగా.. రికార్డ్‌ గరిష్టాలకు ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ 8-11 శాతం దూరంలో నిలవడం గమనార్హం!

ఈసీబీ దన్ను
ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) సహాయక ప్యాకేజీను రెట్టింపునకు పెంచింది. 1.35 ట్రిలియన్‌ యూరోలతో బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా నిధులను పంప్‌చేసేందుకు నిర్ణయించింది. తొలుత ఇందుకు 600 బిలియన్‌ యూరోలను మాత్రమే కేటాయించింది. 2021 జూన్‌వరకూ కొత్త ప్యాకేజీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 96 స్థాయికి బలహీనపడగా.. యూరో 1.135కు బలపడింది. 

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ జూమ్‌
జులై నుంచి విమాన సర్వీసులను 55 శాతం పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు ఏకంగా 41 శాతం దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో ఈబే ఇంక్‌ 6.3 శాతం జంప్‌చేయగా.. చార్లెస్‌ స్క్వాబ్‌ 5.5 శాతం, టీడీ అమెరిట్రేడ్‌ 9 శాతం చొప్పున ఎగశాయి. టీడీ కొనుగోలుకి చార్లెస్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించడం ప్రభావం చూపింది. కాగా.. గురువారం ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, అల్ఫాబెట్‌, యాపిల్‌ 1.6-0.6 శాతం మధ్య బలహీనపడటంతో మార్కెట్లు వెనకడుగు వేసినట్లు నిపుణులు తెలియజేశారు.

ఇతర మార్కెట్లు
గరువారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ 0.6-0.2 శాతం మధ్య నీరసించగా.. ప్రస్తుతం ఆసియాలో సింగపూర్‌, తైవాన్‌, కొరియా 0.6 శాతం చొప్పున ఎగశాయి. ఇండొనేసియా 0.5 శాతం నష్టపోయింది. థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌ నామమాత్ర లాభాలతో, చైనా యథాతథంగా కదులుతున్నాయి. 

మరిన్ని వార్తలు