కొత్త రికార్డుకు చేరువలో నాస్‌డాక్‌

4 Jun, 2020 09:15 IST|Sakshi

అదే బాటలో ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌

2-1 శాతం మధ్య లాభపడ్డ మార్కెట్లు

లాక్‌డవున్‌ ఎత్తివేతతో హుషార్‌

ఆర్థిక రికవరీపై పెరుగుతున్న అంచనాలు

కోవిడ్‌-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను పలు దేశాలు ఎత్తివేస్తున్న నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇందుకు కేంద్ర బ్యాంకుల భారీ సహాయక ప్యాకేజీలు ఆర్థిక రికవరీకి దారిచూపనున్న అంచనాలు దోహదపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 3-4 శాతం మధ్య జంప్‌చేయగా.. యూఎస్‌ ఇండెక్సులు సైతం 2-0.8 శాతం మధ్య ఎగశాయి. ప్రధానంగా నాస్‌డాక్‌ సరికొత్త రికార్డ్‌ గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడం విశేషం! బుధవారం డోజోన్స్‌ 527 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 26,270 వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 42 పాయింట్లు(1.4 శాతం) లాభపడి 3,123 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ 75 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 9,683 వద్ద స్థిరపడింది. వెరసి ఫిబ్రవరిలో నమోదైన రికార్డ్‌ గరిష్టాలకు నాస్‌డాక్‌ 1.4 శాతం, ఎస్‌అండ్‌పీ 7.8 శాతం, డోజోన్స్‌ 11.1 శాతం చేరువలో నిలిచాయి.

ఆందోళనలున్నా
కరోనా వైరస్‌ విజృంభణ తదుపరి చైనా, ఇటలీ ఆర్థిక వ్యవస్థలు తిరిగి ప్రారంభమైన విధంగా యూఎస్‌ సైతం పుంజుకునే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇటీవల జరిగిన నల్లజాతీయుడి హత్యపై జాతి వివక్షకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగుతున్నప్పటికీ బుధవారం ఇన్వెస్టర్లు ఈక్విటీలలో కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

బోయింగ్‌ జూమ్‌
వైమానిక దిగ్గజం బోయింగ్‌ ఇంక్‌ షేరు 13 శాతం దూసుకెళ్లడంతో డోజోన్స్‌కు బలమొచ్చింది. బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ డేనియల్‌ లోబ్స్‌కు చెందిన థర్డ్‌ పాయింట్‌ సంస్థ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో బ్లూచిప్‌ కంపెనీ బోయింగ్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇతర కౌంటర్లలో లిఫ్ట్‌ ఇంక్‌ 9 శాతం జంప్‌చేసింది. మే నెలలో రైడ్లు 26 శాతం పెరగడం ఈ కౌంటర్‌కు జోష్‌నివ్వగా.. టెలికాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్‌ కమ్యూనికేషన్స్‌ షేరు 8 శాతం ఎగసింది. ఇక అమ్మకాలు, నికర లాభాలపై ఆశావహ అంచనాలు ప్రకటించడంతో మైక్రోచిప్‌ టెక్నాలజీ షేరు 12.3 శాతం పురోగమించింది. ఈ బాటలో కాస్మెటిక్స్‌ కంపెనీ కోటీ ఇంక్‌ 13.4 శాతం లాభపడగా.. క్యాంప్‌బెల్‌ సూప్‌ 6 శాతం పతనమైంది.

>
మరిన్ని వార్తలు