ఏఐపై నాస్కామ్‌ సెంటర్స్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌

21 Oct, 2017 04:00 IST|Sakshi

హైదరాబాద్, బెంగళూరుల్లో ఏర్పాటుపై కసరత్తు  

ముంబై: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్సెస్‌ వంటి కొంగొత్త టెక్నాలజీలపై మరింతగా అవగాహన పెంపొందించే దిశగా దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ పలు సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు (సీవోఈ) ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్, బెంగళూరులో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

ఇవి అంతర్జాతీయంగా ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని స్టార్టప్స్‌ని ప్రోత్సాహం అందించడం తదితర కార్యకలాపాలు సాగిస్తాయని వివరించారు. అయితే, ఇందుకోసం ఎంత ఇన్వెస్ట్‌ చేస్తున్నదీ, ఎప్పట్లోగా ఏర్పాటు చేయనున్నది మాత్రం చంద్రశేఖర్‌ వెల్లడించలేదు.

కొత్త సాంకేతికాంశాలపై నియంత్రణలపై స్పందిస్తూ.. నియంత్రణ ముఖ్యమే అయినప్పటికీ మారే టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు విధి విధానాలు తగు రీతిలో సవరించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తదితరులు టెక్నాలజీపై నియంత్రణలకు మద్దతునిస్తుండగా టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మొదలైన వారు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు