ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్: నాస్కామ్

26 Jul, 2016 00:43 IST|Sakshi
ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్: నాస్కామ్

న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్‌గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. టీసీఎస్ తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమిని ఉన్నాయి. కాగ్నిజెంట్.. అమెరికా కంపెనీ అయినప్పటికీ ఆ కంపెనీ దేశంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తోందని నాస్కామ్ పేర్కొంది. దీనికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ సెంటర్లున్నాయి. జూన్ నెల చివరకు.. టీసీఎస్‌లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు.

ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి. టాప్-20లో హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, సీఎస్‌సీ ఇండియా, డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సింటెల్, ఎంఫసిస్, ఈఎక్స్‌ఎల్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, సీజీఐ వంటి కంపెనీలు స్థానం పొందాయి. దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమ దాదాపు 37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో మహిళా ఉద్యోగుల వాటా 13 లక్షలు.

>
మరిన్ని వార్తలు