నాస్కామ్ ఇనోట్రెక్ కు 39 స్టార్టప్ లు ఎంపిక

25 Apr, 2016 16:53 IST|Sakshi

ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కామ్ నిర్వహించే మూడో ఎడిషన్ 'ఇనోట్రెక్' ప్రొగ్రామ్ కు భారత్ నుంచి 39 స్టార్టప్ కంపెనీలు సెలక్ట్ అయ్యాయి. ఈ ప్రొగ్రామ్ మే 2 నుంచి 7 వరకూ అమెరికాలో నాస్కామ్ నిర్వహిస్తుంది. కొత్తగా వ్యాపారం నిర్వహించే టెక్ వ్యాపారవేత్తలకు పెట్టుబడిదారులను కలిసే అవకాశం, అనుభవజ్ఞుల నుంచి వ్యాపార నైపుణ్యాలను నేర్చుకునే సౌకర్యం ఈ ప్రొగ్రామ్ ద్వారా స్టార్టప్ లకు నాస్కామ్ అందిస్తుంది.
టెక్నాలజీ సంస్థలకు మారుపేరుగా ఉన్న సిలికాన్ వ్యాలీ నుంచి అనుభవజ్ఞులు, కార్పొరేషన్లు ఈ ప్రొగ్రామ్ లో పాలుపంచుకుంటున్నారని నాస్కామ్ 10,000 స్టార్టప్ ల సీనియర్ డైరెక్టర్ రజత్ టాండన్ తెలిపారు. భారత్ లో కొత్తగా ఏర్పాటుచేయబోయే సంస్థలు గ్లోబల్ గా ఎలా ఎదగాలి...ఆ కార్పొరేషన్లతో పొత్తు ఏర్పాటుచేసుకుని పోటీతత్వ ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్ ఇంటర్నెట్, గేమింగ్, హెల్త్ కేర్, ఫిన్ టెక్, స్పోర్ట్స్ టెక్ స్టార్టప్ లను తాము ఈ ప్రొగ్రామ్ కు ఎంపికచేసుకున్నామని తెలిపారు. గ్లోబల్ గా ఈ ప్రొడక్ట్స్ కు డిమాండ్ అధికంగా ఉంటుందని, గొప్ప వ్యక్తుల్ని కలవడానికి సిలికాన్ వ్యాలీ ఓ మంచి అవకాశమన్నారు. మొదటి ఏడాదిలో 25 స్టార్టప్ లు, గతేడాది 34 స్టార్టప్ లను, ఈ ఏడాది 39 స్టార్టప్ లను  ఈ ప్రొగ్రామ్ కు నాస్కామ్ ఎంపికచేసుకుంది. 

మరిన్ని వార్తలు