వడ్డీ తగ్గితే దారేది?

21 Mar, 2016 00:25 IST|Sakshi
వడ్డీ తగ్గితే దారేది?

మాధవరావుది ప్రయివేటు ఉద్యోగం. రిటైరయ్యాడు. ఈపీఎఫ్ ద్వారా వచ్చే పెన్షను మరీ తక్కువ కావటంతో... తన రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బును, అప్పటిదాకా పొదుపు చేసుకున్న డబ్బును పోస్టాఫీసులో వేసుకున్నాడు. నెలవారీ ఆదాయం వచ్చేలా డిపాజిట్ చేసి... దాన్లో కొంత ఆర్‌డీకి మళ్లించి... ఇలా ప్రధానంగా వడ్డీపైనే ఆధారపడ్డాడు. ఇపుడు ప్రభుత్వం ఉన్నట్టుండి వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడంతో ఎటూ పాలుపోవటం లేదు.

కృష్ణకుమార్‌దీ ఇంచుమించు అలాంటి పరిస్థితే. ప్రయివేటు ఉద్యోగం కావటంతో భవిష్యత్తు కోసం ఈపీఎఫ్, పీపీఎఫ్‌లనే నమ్మాడు. ఎప్పటికప్పుడు తన దగ్గర మిగిలే డబ్బును వాటికే మళ్లిస్తున్నాడు. వాటిక్కూడా వడ్డీరేట్ల కోత అంటుకోవటంతో ఏం చెయ్యాలన్నది అర్థంకావటం లేదు.

వీళ్లిద్దరే కాదు. దేశంలో కోట్ల మంది పరిస్థితి ఇలాగే ఉంది. పెట్రోలు, డీజిల్ రేట్ల మాదిరిగా మెల్లగా నొప్పి తెలియకుండా మూడు నెలలకోసారి సవరిస్తామని చెప్పిన ప్రభుత్వం... చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీని గడిచిన నాలుగు నెలల్లో 2 సార్లు... కనిష్ఠంగా 0.75 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకూ తగ్గించేసింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండటం... ఆర్థిక లోటు కూడా అదుపులో ఉండటంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించడానికి వెసులుబాటు కలిగింది. ఏప్రిల్ 5న జరిగే ఆర్‌బీఐ సమీక్షలో వడ్డీరేట్లు అర శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లోగా మొత్తమ్మీద వడ్డీ రేట్లు 0.75 శాతం తగ్గొచ్చన్నది అంచనా. ఇదే జరిగితే బ్యాంకు డిపాజిట్లు, చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లు మరింత తగ్గుతాయి. వడ్డీపై ఆధారపడి జీవించేవారి బతుకు దారుణంగా తయారవుతుంది.

ప్రభుత్వ చర్యల తీరు పింఛను దారులకు, వడ్డీపై ఆధారపడ్డవారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. సరే!! మరేం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? ఏఏ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? ఆదాయంతో పాటు భద్రతనూ కల్పించే పథకాలేంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం...  - సాక్షి పర్సనల్

భారీగా తగ్గిన చిన్న మొత్తాల పొదుపు రేట్లు
వీటికి అనుగుణంగా తగ్గనున్న బ్యాంకు డిపాజిట్ రేట్లు   ద్రవ్యోల్బణం అదుపుతో మరింతగా తగ్గనున్న వడ్డీరేట్లు
వచ్చే ఏడాదిలోగా 0.50 నుంచి 0.75 శాతం తగ్గే అవకాశం   తగ్గుతున్న వడ్డీరేట్లతో డిపాజిట్‌దారులు గగ్గోలు
ప్రత్యామ్నాయాలు వెదక్కపోతే పెన్షనర్లకు కష్టకాలమే!   ప్రత్యామ్నాయాల్లో బాండ్ ఫండ్లు; కంపెనీ డిపాజిట్లు
అంతిమంగా ఈక్విటీలవైపు మళ్లించటమే సర్కారు లక్ష్యం!


ఫైనాన్స్ విభాగం
డబ్బు దాచుకోవడమంటే ప్రతి ఒక్కరికీ మొదట గుర్తొచ్చేది పోస్టాఫీసు లేదా బ్యాంకు డిపాజిట్లే. కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలనుకునే వారు మొదట చూసేది భద్రతే. పోస్టాఫీసుగానీ, బ్యాంకు గానీ అయితే భద్రతకు ఢోకా ఉండదు. అదే ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన వాళ్లకయితే పోస్టాఫీసు నెలసరి ఆదాయమో, డిపాజిట్లు అందించే వడ్డీయో జీవనాధారంగా ఉంటుంది. కానీ వడ్డీ రేట్లేమో తగ్గుతున్నాయి. నిజానికి చాలా దేశాల్లో ద్రవ్యోల్బణానికి కనీసం 3-4 శాతం అధికంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లుంటాయి. ఇక్కడేమో పరిస్థితి భిన్నంగా ఉంది. వడ్డీరేట్లు ద్రవ్యోల్బణానికి ఒక శాతం మాత్రమే అధికంగా ఉన్నాయి. గతేడాది వినియోగ ద్రవ్యోల్బణం సుమారుగా 6 శాతం ఉంటే వడ్డీరేట్లు 7 శాతం వద్ద ఉన్నాయి. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేస్తుండగా... వడ్డీరేట్లు 1 శాతం కన్నా ఎక్కువే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీర్ఘకాలమే ఉత్తమం...
బ్యాంకులు ఎప్పటి నుంచో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించాలనుకుంటున్నాయి. కాకపోతే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు కాస్త ఎక్కువగా ఉండటంతో అవి వేచిచూశాయి. పోస్టాఫీసు పథకాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం... అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో బ్యాంకులూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న ఆర్‌బీఐ వడ్డీరేట్లపై తీసుకునే నిర్ణయంతో ఈ విషయంలో స్పష్టత రావచ్చు. వడ్డీరేట్లు ఏ మేరకు తగ్గే అవకాశం ఉందనేది తెలిసిపోతుంది. ఇది కాసేపు పక్కనపెడితే... ఏప్రిల్ 1 నుంచి వడ్డీరేట్లు తగ్గుతున్నాయన్న విషయంలో స్పష్టత వచ్చేసింది.

అందుకే వడ్డీమీద జీవించేవారు ఈ మార్చిలోనే దీర్ఘకాలానికి డిపాజిట్లు చేసుకుంటే మంచిదనేది నిపుణుల సూచన. దీర్ఘకాలిక డిపాజిట్లను ఎంచుకుంటే ఎక్కువ కాలం అధిక వడ్డీరేటును పొందే వెసులుబాటు ఉంటుందని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ వేణుగోపాల్ జాగర్లమూడి సూచించారు. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్ల కంటే పోస్టాఫీసు పథకాలే అధిక వడ్డీరేట్లు ఇస్తున్నాయని, వీటిలో ఇన్వెస్ట్ చేయటమే ఉత్తమమని ఆయన చెప్పారు. అలాగే వడ్డీరేట్లు కొద్దిగా తక్కువ ఉన్నా ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పన్ను పరిధిలో ఉండే వారు ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధికాదాయం పొందవచ్చు. కాకపోతే ఈ నెలలో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఏడాదికి మాత్రమే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయగలరని గుర్తుంచుకోవాలి.
 

 ఇతర ప్రత్యామ్నాయాలివీ..
డిపాజిట్ల కన్నా డెట్ ఫండ్స్ బెటర్...
ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకుండా బ్యాంకు డిపాజిట్ల కంటే అధికాదాయం కావాలనుకునే వారికి డెట్ ఫండ్స్ అనుకూలమనే చెప్పాలి. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేసే గిల్ట్ ఫండ్స్ అధిక రాబడులనిస్తాయి. అయితే ఇదే సమయంలో గిల్ట్ ఫండ్స్‌లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయని గుర్తుంచుకోవాలి. మార్కెట్లోని హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఈ ఒడిదుడుకులను అందిపుచ్చుకునే వారికి గిల్ట్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. గిల్ట్ ఫండ్స్ మార్కెట్ కదలికలపై అంతగా అవగాహన లేనివారు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

ప్రతి నెలా ఆదాయాన్ని ఇచ్చే మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్స్ లేదా షార్ట్, మీడియం టర్మ్ డెట్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో కనీసం మూడేళ్లు ఉండే విధంగా ఇన్వెస్ట్ చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతుంటే ఈల్డ్ పెరగడం ద్వారా మీ సంపద విలువ పెరుగుతుంది. అలా కాకుండా నేరుగా బాండ్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉండి, అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఉన్న బాండ్స్‌ను ఎంచుకుంటే ఇబ్బందులుండవు.

రిస్క్‌కు తగ్గ ఈక్విటీ ఫండ్స్..
ఏప్రిల్ నుంచి వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ఈ లోగా ఇన్వెస్ట్ చేస్తే ఓకే. అయితే చేతిలో డబ్బుల్లేక ఏప్రిల్ తరవాతే ఇన్వెస్ట్ చేయగలిగే పరిస్థితి ఉన్నవారు... వారి రిస్క్‌కు తగ్గట్టుగా ఇతర ప్రత్యామ్నాయ పథకాలవైపు చూడొచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరినవారు, మధ్య వయస్కులైతే వారికి కొద్దిగా నష్టభయాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి సిప్ విధానంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం మంచిదన్నది ఫండ్ మేనేజర్ల సూచన. ఇంత వరకు డిపాజిట్లలో తప్ప ఈక్విటీలో పెట్టుబడి పెట్టనివారు సెక్టోరియల్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో కాకుండా... ఇండెక్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఒకవేళ ఈ స్థాయి రిస్క్ కూడా చేయలేని వారికి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి కాబట్టి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని అందించే అవకాశాలున్నాయి. నిజానికి వడ్డీరేట్లు ఇలా తగ్గుతూ పోతే... రిస్క్ ఉన్నా అధిక రాబడిని ఇవ్వగలిగేవి, ఎంత మొత్తాన్నయినా పెట్టుబడిగా స్వీకరించగలిగే సత్తా ఉన్నవి స్టాక్ మార్కెట్లు మాత్రమే. వీటివైపు ఇన్వెస్ట్‌మెంట్లను మళ్లించటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమనే వాదన కూడా ఉంది.

కంపెనీ డిపాజిట్లతో రిస్కూ... రాబడి కూడా!
కంపెనీ డిపాజిట్లు కూడా స్థిరమైన ఆదాయాన్నిస్తాయి. కానీ వీటికి ఎటువంటి ప్రభుత్వ హామీ ఉండదు. డిపాజిట్లకు బీమా గ్యారంటీ కూడా ఉండదు. ఈ రిస్క్‌కు సిద్థపడితే బ్యాంకు డిపాజిట్లకంటే ఎక్కువ వడ్డీనే పొందొచ్చు. కొన్ని కంపెనీలు డిపాజిట్‌దారులను ఆకర్షించడానికి అధిక వడ్డీలను ఆశచూపిస్తాయి. కానీ ఇలాంటి ఆకర్షణలకు లోనుకాకుండా... ముందుగా ఆ కంపెనీ చరిత్రను చూడాలి. ట్రాక్ రికార్డ్ బాగుండి, మంచి పేరు... మంచి యాజమాన్యం ఉన్న కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సాధారణంగా కంపెనీలు డిపాజిట్లపై ప్రకటించే వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్లకంటే ఎక్కువ, రుణాల వడ్డీరేట్ల కంటే తక్కువగా ఉంటాయి.

కంపెనీలు బ్యాం కుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవటం కన్నా... అంతకన్నా తక్కువ వడ్డీరేటుకు ఇన్వెస్టర్ల నుంచి డిపాజిట్లు సేకరించడం మంచిది కదా... అని ఆలోచిస్తాయి. అలా కాకుండా బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లకన్నా ఎక్కువ వడ్డీనిస్తామని కంపెనీలు గనక చెబితే... ఆ కంపెనీల గురించి ఒకసారి ఆలోచించాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోబట్టే అవి ఇన్వెస్టర్ల దగ్గరకు వచ్చాయని అనుకోవాలి. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు సుమారు 9 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

 

మరిన్ని వార్తలు