దేశీ ఫార్మా పరుగు షురూ!

8 Jul, 2020 03:12 IST|Sakshi

మెరుగుపడుతున్న పరిస్థితులు

నియంత్రణ పరమైన వెసులుబాట్లు

వ్యయాలు, రుణాలను తగ్గించుకుంటున్న కంపెనీలు

దీంతో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి

న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా రంగం ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. ఈ రంగంలో మెరుగుపడుతున్న పరిస్థితులను కంపెనీలు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కరోనా నియంత్రణకు దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఫార్మా రంగం షేర్లు 40 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. కొన్ని స్టాక్స్‌ అయితే మల్టీబ్యాగర్లుగానూ  (రెట్టింపునకు పైగా పెరగడం) మారాయి. 2015లో ఫార్మా షేర్ల ర్యాలీ తర్వాత అవి క్రమంగా ఇన్వెస్టర్ల నిరాదరణకు గురయ్యాయి. దాంతో ఏవో కొన్నింటిని మినహాయిస్తే మెజారిటీ ఫార్మా స్టాక్స్‌ వాటి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. కానీ, కరోనా రాకతో మార్కెట్‌ పరిస్థితులు ఫార్మాకు మళ్లీ అనుకూలంగా మారాయి. కంపెనీల మూలాలు కూడా బలపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ధరల పరమైన ఒత్తిళ్లు తగ్గడం, యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఔషధ అనుమతులు పెరగడం దేశీయ కంపెనీలకు కలిసొచ్చాయి. ఫార్మా రంగం ఇక ముందూ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతులు...
ఫార్మా కంపెనీలు ఉత్తమ తయారీ విధానాలను పాటించడం, దిద్దుబాటు చర్యల ద్వారా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నిబంధనల అమలు విషయంలో మెరుగుపడ్డాయి. మరోవైపు కరోనా మహమ్మారి కూడా యూఎస్‌ఎఫ్‌డీఏ వైఖరిలో మార్పునకు దారితీసింది. ఏప్రిల్‌లో కేవలం పది రోజుల వ్యవధిలోనే భారత ఫార్మా కంపెనీలకు చెందిన నాలుగు తయారీ కేంద్రాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ వేగంగా అనుమతులు జారీ చేయడం ఈ కోణంలోనే చూడాలి. అమెరికా మార్కెట్లో దేశీయ కంపెనీలకు బలమైన వాటాయే ఉంది. కాకపోతే యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇక ముందూ యూఎస్‌ఎఫ్‌డీఏ భారత ఫార్మా కంపెనీల యూనిట్లకు అనుమతుల జారీ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తుందన్న అంచనాలు ఈ కంపెనీలకు అనుకూలమే. 

రుణ భారం తగ్గింపు...
అనేక కారణాలతో ఫార్మా కంపెనీలకు రుణ భారం సమస్యగా మారిపోయింది. లాభసాటి కాని జపాన్, దక్షిణ అమెరికా మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కొన్ని ఫార్మా కంపెనీలు చేతులు కాల్చుకున్నాయి. వీటికితోడు అమెరికా మార్కెట్లో జనరిక్‌ ఔషధాల ధరల ఒత్తిళ్లు, నిబంధనల అమలు విషయంలో యూఎస్‌ఎఫ్‌డీఏ మరీ కఠిన వైఖరి అనుసరించడంతో కంపెనీలకు రుణ భారం దించుకునే అవకాశం లభించలేదు. కానీ, గత కొంత కాలంగా కంపెనీలు తమ బ్యాలన్స్‌ షీట్ల బలోపేతంపై దృష్టి పెట్టాయి. అరబిందో ఫార్మా బిలియన్‌ డాలర్లతో అమెరికాలోని శాండోజ్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఇందులో భాగమే. 2022 నాటికి రుణ రహిత కంపెనీగా మారాలన్నది అరబిందో ప్రణాళిక.

వ్యయ నియంత్రణలు: అమెరికా వంటి కీలక మార్కెట్లలో ధరలకు సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో కంపెనీలకు మరో మార్గం లేక తమ వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. క్షేత్రస్థాయి సిబ్బందిలో కోత, పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌ తగ్గించుకోవడం తదితర చర్యల ద్వారా ఔషధ తయారీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉండే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.  

వ్యూహాత్మక విధానాలు 
భారత ఫార్మా కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకుంటున్నాయి. లుపిన్‌ జపాన్‌ మార్కెట్‌ నుంచి తప్పుకోగా, డాక్టర్‌ రెడ్డీస్‌ తన యూఎస్‌ స్పెషాలిటీ ఔషధాల వ్యాపారాన్ని తగ్గించుకుంది. యూనికెమ్‌ ల్యాబ్, వోకార్డ్‌ తమ ఔషధ పోర్ట్‌ఫోలియోను విక్రయించాయి. డాక్టర్‌ రెడ్డీస్, లుపిన్, బయోకాన్, గ్లెన్‌మార్క్‌ ముఖ్యమైన విభాగాల్లో విదేశీ నిపుణులను నియమించుకున్నాయి.

వేల్యూషన్లు తక్కువగానే..
నిబంధనల అమలు, పరిపాలనా, న్యాయ పరమైన వివాదాల సమస్యలు ఫార్మా కంపెనీలను ఇంకా వీడలేదు. అయితే, ఫార్మా స్టాక్స్‌ ప్రస్తుత ధరలు ఈ అంశాలన్నింటినీ సర్దుబాటు చేసుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సన్‌ఫార్మా, లుపిన్, గ్లెన్‌మార్క్‌ స్టాక్స్‌ వాటి 2015 గరిష్ట ధరల నుంచి చూస్తే ఇప్పటికీ 50% పైనే తక్కువలో ట్రేడవుతున్నాయనేది నిపుణుల  మాట. డాక్టర్‌ రెడ్డీస్, సిప్లా, అరబిందో ఫార్మా, టోరెంట్‌ ఫార్మా, క్యాడిలా 2015 గరిష్ట స్థాయిలకు చేరువలో 10–15% తక్కువకు ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు