ఫార్మాకు ‘కోవిడ్‌’ ఫీవర్‌!!

19 Feb, 2020 03:51 IST|Sakshi

పెరగనున్న ముడి వస్తువుల రేట్లు

ఆందోళనలో ఔషధ రంగం

తోడ్పాటు చర్యలపై ఆర్థిక మంత్రి భరోసా

న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాలకు విస్తరించిన కరోనావైరస్‌ సెగ దేశీ ఫార్మా పరిశ్రమకు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనాలో పరిస్థితులు గానీ సత్వరం చక్కబడకపోతే ఔషధాల్లో ఉపయోగించే ముడి వస్తువుల రేట్లు గణనీయంగా పెరగవచ్చని ఫార్మా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ‘ఇదే పరిస్థితి కొనసాగితే యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌ (ఏపీఐ) ధరలు పెరిగిపోతాయి‘ అని జైడస్‌ గ్రూప్‌ చైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ వెల్లడించారు. 2018–19 గణాంకాల ప్రకారం.. భారత సంస్థలు దిగుమతి చేసుకునే బల్క్‌ డ్రగ్స్‌లో సింహభాగం 67.56 శాతం వాటా చైనాదే ఉంది. కరోనా వైరస్‌కు సంబంధించి తాజా పరిస్థితులపై ఫార్మాతో పాటు టెక్స్‌టైల్స్, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్, సోలార్, ఆటో, సర్జికల్‌ ఎక్విప్‌మెంట్స్, పెయింట్స్‌ తదితర రంగాల ప్రతినిధులు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. దేశీ పరిశ్రమలపై కరోనావైరస్‌ ప్రతికూల ప్రభావాలు పడకుండా చూసేందుకు ప్రభుత్వం త్వరలో తగు చర్యలు ప్రకటిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

ఆందోళన వద్దు: నిర్మలా సీతారామన్‌ 
కీలక ముడి వస్తువుల దిగుమతుల్లో జాప్యం వల్ల ఫార్మా, కెమికల్, సౌర విద్యుత్‌ పరికరాల రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, కరోనావైరస్‌ కారణంగా ధరల పెరుగుదల గురించి ఆందోళన అక్కర్లేదని ఆమె చెప్పారు. ఔషధాలు, మెడికల్‌ పరికరాల కొరత లేదన్నారు. కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఫార్మా పరిశ్రమ కోరుతోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మరోవైపు, దేశీ ఫార్మా సంస్థలకు ఏపీఐల సరఫరాపై కరోనావైరస్‌ ప్రభావాల మీద ఫార్మా విభాగం (డీవోపీ) అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాలో నూతన సంవత్సర సెలవుల కారణంగా గత 20–25 రోజులుగా సరఫరా ఆగిపోయిందని పేర్కొన్నాయి. బల్క్‌ డ్రగ్స్‌ కోసం భారత ఫార్మా సంస్థలు ఎక్కువగా చైనా మీదే ఆధారపడుతున్నాయి.

రెండు, మూడు నెలల స్టాక్‌ మాత్రమే ఉంది: ఐపీఏ 
భారత ఔషధ పరిశ్రమ వద్ద రెండు, మూడు నెలలకు సరిపడ మాత్రమే యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ నిల్వలు ఉన్నాయని ఇండియా ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) వెల్లడించింది. చైనా నుంచి ఏటా రూ.17,000 కోట్ల విలువైన ముడి సరుకు (ఏపీఐ) భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ఆ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఐపీఏ సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ తెలిపారు. బయో ఆసియాలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఏం జరుగుతుందో ఊహించే పరిస్థితి లేదు. రెండు, మూడు నెలలకు సరిపడ మాత్రమే నిల్వలున్నాయి. మార్చి మొదటి వారం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందని భావిస్తున్నాం’ అన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా