జీఎస్‌టీలోకి సహజవాయువు, ఏటీఎఫ్‌?

16 Jul, 2018 01:57 IST|Sakshi

21న నిర్ణయం తీసుకోనున్న జీఎస్‌టీ మండలి

న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజవాయువు(సీఎన్‌జీ)ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఈ వారంలో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో పరిశీలించనున్నారు. గతేడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, క్రూడాయిల్, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ను మాత్రం దీన్నుంచి మినహాయించారు. జీఎస్‌టీలోకి చేరిస్తే కేంద్ర, రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో మినహాయించారు.

అయితే, సహజవాయువు, ఏటీఎఫ్‌ను జీఎస్‌టీలోకి తీసుకురావడం అనుకూలమేనన్న ప్రతిపాదనను జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ నెల 21న జరిగే సమావేశంలో పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం జీఎస్‌టీలో గరిష్ట పన్ను రేటు 28గా ఉంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్‌ను ఈ శ్లాబులోకి తీసుకొస్తే కేంద్ర, రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది.

ఎందుకంటే కేంద్రం, రాష్ట్రాల పన్నులు కలిపి ఏటీఎఫ్‌పై 39–44 శాతం స్థాయిలో ఉన్నాయి. జీఎస్‌టీ రేటుకు అదనంగా రాష్ట్రాలు వ్యాట్‌ను లెవీగా విధించుకునే అవకాశం కల్పించడమే మార్గమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సహజవాయువు విషయంలోనూ ఇబ్బంది ఉంది. జీఎస్‌టీలో చేర్చి 12 శాతం పన్ను రేటు విధిస్తే ఆదాయ లోటును ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 18 శాతం విధిస్తే విద్యుత్తు, ఎరువుల పరిశ్రమలకు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు