గృహరుణాలకు ఎన్‌బీఎఫ్‌సీ దెబ్బ

20 Oct, 2018 01:09 IST|Sakshi

మందగించనున్న టూవీలర్ల విక్రయాలు

నాన్‌–బ్యాంకింగ్‌ సంస్థలకు నిధుల కొరతే కారణం

నివేదికల్లో వెల్లడి  

ముంబై: నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల కొరతతో అల్లాడుతుండటం.. వాటిపై ఆధారపడిన పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా గృహ రుణాలు, ద్విచక్ర వాహనాలు మొదలైన విభాగాలపై ఇది మరింతగా కనిపించనుంది. వివిధ కన్సల్టెన్సీలు విడుదల చేసిన నివేదికల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిధుల కొరత కారణంగా కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల.. గృహ రుణాల మంజూరీ కార్యకలాపాలు మందగించే అవకాశాలున్నాయని జపనీస్‌ బ్రోకరేజి సంస్థ నొమురా పేర్కొంది.

ఇప్పటికే గృహాల ధరల్లో వృద్ధి మందగించిందని, తాజా పరిణామాలతో ఆ ఒత్తిడి ఇకపైనా కొనసాగవచ్చని తెలిపింది. దీన్ని బ్యాంకులు అందిపుచ్చుకుని, ఆ మేరకు తమ మార్కెట్‌ వాటాను పెంచుకోవచ్చని నొమురా వివరించింది. కానీ, అంతిమంగా రుణగ్రహీతలు అధిక వడ్డీలు చెల్లించాల్సి రావొచ్చని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు కూడా సమస్యలు ఎదురుకావచ్చని వివరించింది.

అమ్ముడు కాని గృహాల సంఖ్య పెరిగిపోతూ ఒత్తిడిలో ఉన్న రియల్టర్లకు ఇది మరింత సమస్యాత్మకంగా మారవచ్చని పేర్కొంది. మరోవైపు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల నిధుల కొరత కష్టాలను తీర్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌యేతర ఫైనాన్సింగ్‌ కార్యకలాపాల్లోని ఎన్‌బీఎఫ్‌సీలకి బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.  

ద్విచక్ర వాహనాల అమ్మకాలకూ ప్రతికూలం
ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్యలు అటు ద్విచక్రవాహనాల అమ్మకాలకు కూడా ప్రతికూలం కానున్నాయి. కమర్షియల్‌ పేపర్స్‌ ద్వారా సమీకరించిన రుణాలను చాలామటుకు ఎన్‌బీఎఫ్‌సీలు త్వరలో తిరిగి చెల్లించాల్సి రానుందని, దీంతో వాటి వద్ద నిధుల కొరత ఏర్పడి రుణాల మంజూరీ సామర్ధ్యం తగ్గొచ్చని క్రెడిట్‌ సూసీ పేర్కొంది. దీంతో ఈ మధ్యకాలంలో ఎన్‌బీఎఫ్‌సీల ఫైనాన్సింగ్‌తో గణనీయంగా పెరిగిన టూ–వీలర్ల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని వివరించింది.

2014 ఆర్థిక సంవత్సరంలో 30 శాతంగా ఉన్న టూవీలర్‌ ఫైనాన్సింగ్‌.. ఎన్‌బీఎఫ్‌సీల ఊతంతో 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి చేరింది. ప్రస్తుతం టూవీలర్‌ ఫైనాన్సింగ్‌లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా దాదాపు 60 శాతంగా ఉన్నట్లు క్రెడిట్‌ సూసీ తెలిపింది. కార్లు, వాణిజ్య వాహనాలు మొదలైన వాటికి కూడా ఫైనాన్సింగ్‌ జరుగుతున్నప్పటికీ ఇటు బ్యాంకులు, అటు ఎన్‌బీఎఫ్‌సీల రుణాల వాటా దాదాపు సమస్థాయిలోనే ఉంటోందని, కానీ టూవీలర్‌ రుణాల సెగ్మెంట్‌లో నాన్‌–బ్యాంకింగ్‌ సంస్థల వాటా అధికంగా ఉందని వివరించింది.

టూవీలర్ల అమ్మకాల్లో దాదాపు 25 శాతం ఉండే పండుగ సీజన్‌లోనే ఉంటాయని, అయితే సరిగ్గా ఇదే సమయంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో వాటి అమ్మకాలకు ప్రతికూలం కాగలదని తెలిపింది. టూ వీలర్లలో ఐషర్‌ వాహనాలు ఎక్కువగా ఫైనాన్స్‌పై అమ్ముడవుతుంటాయని.. బజాజ్‌ తదితర సంస్థల తరహాలో ఆ కంపెనీకి సొంత ఫైనాన్స్‌ సంస్థ లేకపోవడంతో అమ్మకాలపై అత్యధికంగా ప్రభావం ఉండొచ్చని క్రెడిట్‌ సూసీ వివరించింది.

మరిన్ని వార్తలు