బ్యాంక్‌లకు భలే అవకాశం

9 Nov, 2018 01:37 IST|Sakshi

ఎన్‌బీఎఫ్‌సీల  వాటా బ్యాంకులకే...

కానీ అవి అందుకునే స్థితిలో లేవు

కొత్త రుణాలివ్వటంలో  వాటికెన్నో అడ్డంకులు

భౌగోళికంగానూ బ్యాంకుల విస్తృతి తక్కువే

తాజా నివేదికలో డీబీఎస్‌  

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) తాజా సంక్షోభం బ్యాంక్‌లకు మంచి అవకాశంగా మారనున్నట్లు సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ అంచనా వేసింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రుణాల్లో 12–15 శాతం వాటా ఎన్‌బీఎఫ్‌సీలదేనని డీబీఎస్‌ ఆర్థిక వేత్త రాధిక రావు పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో ఈ వాటా రుణాలు బ్యాంక్‌లకు దక్కనున్నాయి. కాకపోతే ఈ రుణ డిమాండ్‌ను తట్టుకునే పరిస్థితుల్లో బ్యాంక్‌లు లేవు. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ కఠిన చర్యల చట్రాన్ని బిగిస్తోంది. ఫలితంగా తాజా రుణాలను బ్యాంక్‌లు జారీ చేయలేవు’’ అని రాధిక వివరించారు. సూక్ష్మ, గృహ, వాహన గ్రామీణ రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీలు బాగా విస్తరించాయని, భౌగోళికంగా బ్యాంక్‌లు ఈ స్థాయిలో చొచ్చుకుపోలేదని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల తాజా సంక్షోభం కారణంగా జీడీపీ అంచనాలను డీబీఎస్‌ తగ్గించే అవకాశాలున్నాయని కూడా చెప్పారామె. జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%గా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతంగా ఉండొచ్చని డీబీఎస్‌ అంచనా వేస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంపై  ఆమె ఇంకా ఏం చెప్పారంటే... 

►ఈ సంక్షోభం కారణంగా ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక స్థితిగతులు కుదేలయ్యాయి. ఫలితంగా ఈ షాడో బ్యాంక్‌ల రుణ వితరణ మందగిస్తుంది.  
► తాజా పరిస్థితుల కారణంగా ఎన్‌బీఎఫ్‌సీలపై  నియంత్రణలు మరింత కట్టుదిట్టమవుతాయి.  
​​​​​​​►   నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నిర్వహణ పనితీరు కఠినంగా మారనున్నది.  
​​​​​​​► ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీల రుణ వితరణ తగ్గుతుంది. దీంతో వాటి జోరుకు అడ్డుకట్ట పడటమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థలో రుణ వితరణ మందగిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. 
​​​​​​​►  రుణ వృద్ధి మందగమనం కారణంగా రుణ నాణ్యతపై ఆందోళన తగ్గుముఖం పడుతుంది. నష్ట భయం అధికంగా ఉన్న రుణాలు తగ్గి నాణ్యత గల రుణాలు పెరుగుతాయి.  
​​​​​​​►  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు రెండేళ్ల క్రితం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు 8.4 శాతంగా ఉండగా, ఈ ఏడాది ఇది 11.3 శాతానికి పెరిగింది. ఈ వాణిజ్య సంస్థలకు బ్యాంక్‌లిచ్చిన రుణాలు 60 శాతం నుంచి 51 శాతానికి పడిపోయాయి.  
​​​​​​​►  ఈ ఏడాది సెప్టెంబర్‌లో 12.5 శాతంగా ఉన్న బ్యాంక్‌ రుణ వితరణ ఈ అక్టోబర్‌లో 14.4 శాతానికి పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీలు క్యాపిటల్‌/మనీ మార్కెట్ల నుంచి కాకుండా బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకోవడం పెరగడమే దీనికి ప్రధాన కారణం.  
​​​​​​​► మార్కెట్‌ ఆధారిత రుణాలపై వడ్డీ వ్యయాలు పెరగడంతో పలు ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంక్‌ రుణాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.  
​​​​​​​►    పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించి, వ్యయాలను నియంత్రణలో ఉంచుకోగలవు. కానీ చిన్న  ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సమీకరణ కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే.    

మరిన్ని వార్తలు