ఎన్‌సీఎల్‌టీలో రుయాలకు చుక్కెదురు

30 Jan, 2019 00:47 IST|Sakshi

ఎస్సార్‌ స్టీల్‌ రుణాలను తీర్చివేస్తామన్న పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ రుణ బకాయిలను తీర్చివేస్తామంటూ రుయా కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్‌ బెంచ్‌ తిరస్కరించింది. ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్ల ప్రణాళికను ఆమోదించొద్దన్న రుణదాతల అభ్యర్థన చట్టవిరుద్ధం కాదని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో ఎస్సార్‌ స్టీల్‌ను కాపాడుకోవాలన్న రుయాల ప్రయత్నాలకు చుక్కెదురు అయింది. అదే సమయంలో ఎస్సార్‌ స్టీల్‌ను విక్రయించడం ద్వారా రుణ బకాయిలను తీర్చుకోవాలన్న రుణదాతల ప్రయత్నాలకు ఊతం లభించింది. ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ వేసిన రూ.42,000 కోట్ల బిడ్‌ను రుణదాతల కమిటీ ఇప్పటికే ఆమోదించడం తెలిసిందే.

బ్యాంకులకు రూ.50,800 కోట్ల మేర బకాయిలను కంపెనీ చెల్లించాల్సి ఉండటంతో, వీటిని రాబట్టుకునేందుకు దివాలా పరిష్కార చట్టం కింద చర్యలు చేపట్టింది. రూ.54,389 కోట్లను చెల్లించేందుకు తాము ఆఫర్‌ ఇచ్చామని, రుణదాతలకు ఇదే అత్యధిక చెల్లింపు ప్రతిపాదన అని ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్లు ఎన్‌సీఎల్‌టీకి తెలిపారు. ‘‘ఐబీసీలో ఇటీవలే ప్రవేశపెట్టిన సెక్షన్‌ 12ఏ కింద మా ప్రతిపాదన సమర్పించాం. అలాగే, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు సైతం ఈ సెక్షన్‌ వర్తిస్తుందని స్పష్టం చేస్తోంది’’ అని ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఎన్‌సీఎల్‌టీ పూర్తి తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఎన్‌సీఎల్‌టీ తీర్పు ఐబీసీ సమగ్రతను కాపాడేలా ఉందని, నిబంధనల ఆధారంగా చట్టం పనిచేస్తుందని భరోసా ఇచ్చినట్టయిందని ఆర్సెలర్‌ మిట్టల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా, భారత్‌కు కూడా ఇది సానుకూల పరిణామమని, ఈ కేసులో సత్వర పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు