ఆర్‌కాం దివాలా ప్రక్రియ షురూ

9 May, 2019 20:08 IST|Sakshi

ఆర్‌కాం  బోర్డు  రద్దు 

తదుపరి విచారణ మే 30న

అప్పుల ఊబిలో  కూరుకుపోయిన అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం)  నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో   దివాలా  ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అలాగే దివాలా ప్రక్రియనుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను ఎన్‌సీఎల్‌టీ గురువారం అంగీకరించింది.  దివాలా ప్రక్రియలో 357రోజుల (మే 30, 2018 నంచి ఏప్రిల్ 30 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కామ్ కోరగా ట్రైబ్యునల్  ఇందుకు సమ్మతించింది.  అనంతరం తదుపరి విచారణను  మే30వ తేదీకి వాయిదా వేసింది. 

ఎస్‌బీఐతో పాటు వివిధ బ్యాంకులకు ఆర్‌కామ్ రూ.50వేల కోట్ల వరకు అప్పు ఉంది. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చెల్లించని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్ కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి ఇస్తూ సంస్థ బోర్డును రద్దు చేసింది. కొత్త రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌ను అపాయింట్ చేసింది. అంతేకాకుండా  ఎస్‌బీఐ నేతృత్వంలోని 31 బ్యాంకు కన్సార్షియానికి  క్రెడిటర్స్‌ కమిటీ ఏర్పాటుకు అనుమతిచ్చింది. 

ఇప్పటికే దాఖలైన దివాలా పిటిషన్ పైన నేషనల్‌ కంపెనీ లా అప్పెలట్‌ ట్రైబ్యునల్‌, సుప్రీం కోర్టు స్టే విధించాయి. ఈ నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్‌కాం కోరింది. ఇందుకు ట్రైబ్యునల్‌ ఒప్పుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటి లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఆర్‌కాం గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. కానీ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు.

మరిన్ని వార్తలు