ఇక ఇంటి వద్దకే ఇంధనం!!

21 Mar, 2018 00:08 IST|Sakshi

ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ డీజిల్‌ హోమ్‌ డెలివరీ సర్వీసులు

ప్రయోగాత్మకంగా పుణెలో అమలు 

త్వరలో పెట్రోల్‌ కూడా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ తాజాగా ఇంటి వద్దకే ఇంధనం అందించే సర్వీసులు ప్రారంభించింది. ఇందులో భాగంగా డీజిల్‌ను హోమ్‌ డెలివరీ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం పుణెలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వీసులను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. అలాగే పెట్రోల్‌ కూడా హోమ్‌ డెలివరీ చేయాలని యోచిస్తోంది.

రవాణాకు అనువైనది కావడంతో పాటు కొంత సురక్షితం అయినందున ముందుగా హోమ్‌ డెలివరీకి డీజిల్‌ని ఎంచుకున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సీఎండీ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. పెట్రోల్‌ని కూడా అందించాలంటే కొన్ని రిస్కులు ఉన్నాయని.. దీనిపై పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో)తో చమురు కంపెనీలు చర్చిస్తున్నాయని ఆయన వివరించారు. ఇంధనాలను ఇంటివద్దకే అందించే సర్వీసుల అంశాన్ని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దాదాపు ఏడాది క్రితమే ప్రస్తావించారు.

2017 జూన్‌లోనే బెంగళూరుకి చెందిన స్టార్టప్‌ సంస్థ ఏఎన్‌బీ ఫ్యూయల్స్‌ సంస్థ .. మైపెట్రోల్‌పంప్‌ బ్రాండ్‌ పేరిట పెట్రోల్, డీజిల్‌ హోమ్‌ డెలివరీ సర్వీసులు కూడా మొదలుపెట్టింది. అయితే, ఈ విధంగా ఇంధనాలను రవాణా చేయడం సురక్షితం కాదని, ఏఎన్‌బీకి ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలంటూ చమురు కంపెనీలకు పెసో సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ ఉదంతం తర్వాత.. మళ్లీ ఇంధనాల హోమ్‌ డెలివరీకి ఇండియన్‌ ఆయిల్‌ తదితర చమురు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. వీటిలో ముందుగా ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ ఈ సర్వీసులు ప్రారంభించింది.  

మరిన్ని వార్తలు