వైద్యానికి రుణం కావాలా?

13 Nov, 2017 01:47 IST|Sakshi

ఈ అంశాలు గుర్తుంచుకోవాలి సుమా..!

అత్యవసర చికిత్సకు సంబంధించి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీకి మించినది మరొకటి లేదు. అయితే, అలాంటి హెల్త్‌ పాలసీ లేకపోయినా.. ఆస్పత్రి బిల్లు సమ్‌ అష్యూర్డ్‌ని మించినా.. మెడికల్‌ లోన్స్‌ మీకు అక్కరకొస్తాయి.

భవిష్యత్‌లో అత్యవసర వైద్య చికిత్స వ్యయాలను ఎదుర్కొనేందుకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అద్భుతమైన సాధనాలనటంలో ఎలాంటి సందేహం లేదు. కవరేజీని బట్టి చికిత్స సమయంలో ఆర్థికంగా కూడా ఇవి తోడ్పాటునిస్తాయి. ఒకవేళ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ లేకపోయినా.. లేదా మీ చికిత్స వ్యయాలు కవరేజీ కన్నా మించిపోయినా.. లేదా చేతిలో సరిపడేంత నగదు లేకపోయినా.. మెడికల్‌ లోన్‌ను ఆశ్రయించే అవకాశాలు ఎటూ ఉన్నాయి. అదెలాగో చూద్దాం...

వ్యక్తిగత రుణాల్లాంటివి మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే, సులభతరమైన ప్రక్రియతో పాటు సత్వరం మంజూరయ్యే అవకాశాలుండటంతో చికిత్సపరమైన అత్యవసర పరిస్థితుల్లో మెడికల్‌ లోన్స్‌ అనువైనవిగా ఉంటున్నాయి. కానీ మెడికల్‌ లోన్‌ తీసుకోవడానికి ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.

మెడికల్‌ లోన్‌ ఉపయోగాలు..
రుణం అందించే సంస్థ నిబంధనలు బట్టి ప్రీ–అప్రూవ్డ్‌ ట్రీట్‌మెంట్స్‌ జాబితాలో ఉన్న శస్త్రచికిత్స, ఇతరత్రా థెరపీ మొదలైన వాటికి సంబంధించి మెడికల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తనఖా వంటివేమీ ఉండవు. పర్సనల్‌ లోన్‌ కన్నా తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది.

ఆరోగ్య బీమాకి.. వైద్య రుణానికి మధ్య తేడా
వైద్య బీమా ఉన్నా సరే ఒకోసారి సమ్‌ అష్యూర్డ్‌ కన్నా బిల్లు ఎక్కువ రావచ్చు. దాన్ని కట్టేందుకు సరిపోయేంత డబ్బు చేతిలో లేకపోవచ్చు. అలాంటివారికి మెడికల్‌ లోన్‌ అక్కరకొస్తుంది. కేవలం కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌పైనే ఎక్కువగా ఆధారపడే వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో చికిత్స ఖర్చులకు పాలసీ కవరేజీ సరిపోకపోవచ్చు. వారికిది ఉపయోగకరంగా ఉంటుంది.

డాక్యుమెంట్స్‌ ధృవీకరణకు లోబడి..
సాధారణంగా దరఖాస్తు చేసుకున్న 24–72 గంటల్లోగా మెడికల్‌ లోన్స్‌ మంజూరవుతుంటాయి. పూర్తి చేసిన దరఖాస్తు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, చెల్లుబాటయ్యే గుర్తింపు ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం మొదలైన డాక్యుమెంట్స్‌ సమర్పించాల్సి ఉంటుంది. రుణం పొందే అవకాశాలు మరింత మెరుగ్గా ఉండాలంటే మరో సహ–రుణగ్రహీతను కూడా తీసుకురమ్మని కొన్ని బ్యాంకులు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు అడగొచ్చు.  

వడ్డీ రేటు.. 
వైద్య రుణాలపై వడ్డీ రేట్లు వార్షికంగా 12–24 శాతం మధ్య ఉంటాయి. కొన్ని అసాధారణ కేసుల్లో మధ్యవర్తిత్వ వ్యయాల కారణంగా అగ్రిగేటర్‌ సంస్థలు 36 శాతం దాకా కూడా వసూలు చేయొచ్చు. రుణమిచ్చే సంస్థ .. చికిత్స వ్యయాలను నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది.  

రీపేమెంట్‌.. 
రీపేమెంట్‌ వ్యవధి సాధారణంగా ఆరు నెలల నుంచి అయిదేళ్ల దాకా ఉంటుంది. నెలవారీ వాయిదాల (ఈఎంఐ) కింద కట్టాల్సి ఉంటుంది. ప్రతీ ఈఎంఐలో కొంత అసలు, కొంత వడ్డీ భాగాలు ఉంటాయి. ప్రారంభ దశ ఈఎంఐల్లో వడ్డీ భాగమే ఎక్కువగా ఉంటుంది.

అర్హత .. ప్రాసెసింగ్‌కు పట్టే సమయం..
వ్యక్తిగత, మెడికల్‌ లోన్స్‌కి తనఖాల్లాంటివి ఉండవు కనుక చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు బ్యాంకులు.. రుణం తీసుకునే వారి సిబిల్‌ స్కోరును పరిశీలిస్తాయి. ఈ స్కోరు 750 లేదా అంతకన్నా ఎక్కువుంటే రుణ మంజూరీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒకవేళ తీసుకోగోరే రుణ మొత్తం చాలా ఎక్కువగా ఉన్న పక్షంలో బ్యాంకు ఇతరత్రా తనఖా లేదా థర్డ్‌ పార్టీ గ్యారంటీ లాంటివి అడగొచ్చు. ఉద్యోగులైతే శాలరీ సర్టిఫికెట్‌.. స్వయం ఉపాధి పొందుతున్న వారు సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో నిధులు సమకూర్చుకోవడం తక్షణ ప్రాధాన్య అంశమే అయినప్పటికీ... మెడికల్‌ లోన్‌ తీసుకునే ముందుగా నియమ, నిబంధనలు.. ఇతరత్రా చార్జీలు మొదలైనవాటన్నింటి గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాకే తగు నిర్ణయం తీసుకోవాలి.


– అదిల్‌ షెట్టి
సీఈవో, బ్యాంక్‌బజార్‌డాట్‌కామ్‌   

మరిన్ని వార్తలు