నీతి ఆయోగ్‌ను సంస్కరించాలి: వైవీరెడ్డి

29 Mar, 2019 05:00 IST|Sakshi

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ను సంస్కరించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ నిర్ణయాలు ‘‘విస్తృత ప్రాతిపదికన ఆమోదం’’ పొందడంలేదని పేర్కొన్న ఆయన, ‘‘అంశాల పట్ల నిర్దిష్ట కేంద్రీకరణ’’ కూడా లేదని విశ్లేషించారు. కేంద్ర, రాష్ట్రాలను సమన్వయం చేస్తూ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా నీతి ఆయోగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ప్రధాన అంశంగా వైవీరెడ్డి ‘ఇండియన్‌ ఫిస్కల్‌ ఫెడరలిజం’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆవిష్కరణను పురస్కరించుకుని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ మాట్లాడుతూ వ్యయాలు, బదలాయింపులకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలన్నారు.  రాష్ట్రాల మధ్య ద్రవ్య, ఆర్థిక సమన్వయం విషయంలో ఒకప్పటి ప్రణాళికా సంఘం కీలక పాత్ర పోషించిందని వైవీరెడ్డి పేర్కొన్నారు. అయితే దీని స్థానంలో 2015లో నీతిఆయోగ్‌ ఏర్పాటయిన తర్వాత ఆయా బాధ్యతల నిర్వహణకు సంబంధించి పలు సందేహాలు వ్యక్తమయ్యాయని అన్నారు.

కనీస ఆదాయ పథకం సాధ్యమే... కానీ
పేదల సంక్షేమానికి రాహుల్‌ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం గురించి కూడా వైవీ రెడ్డి ప్రస్తావించారు.  ప్రస్తుతం చేస్తున్న కొన్ని వ్యయాలకు కోతపెట్టడం ద్వారా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలుంటుందన్నారు. అయితే ద్రవ్యలోటు కొంత అవకాశం ఉందని పేర్కొన్న ఆయన, ఈ సమస్యనూ అధిగమించడానికి కేంద్రానికి అవకాశం ఉంటుందన్నారు. అయితే రాష్ట్రాలకు మాత్రం ఇలాంటి పథకాలు అమలు చేయడం కష్టమ చెప్పారు. రుణాలకు సంబంధించి రాష్ట్రాలకు పరిమితులు ఉండడం, తమ ఆర్థిక అవసరాలకు కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి దీనికి కారణమన్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఇలాంటి పథకం అమలు చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇలాంటి సందర్భం ‘‘క్లిష్టతకు’’ దారితీసే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు