సింగిల్‌ విండో కావాలి!

3 Nov, 2018 01:07 IST|Sakshi

ఒక్క దరఖాస్తుతోనే అన్ని ఎన్‌వోసీలు: టీబీఎఫ్‌ వినతి

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌–ఐపాస్‌ ద్వారా ఎలాగైతే పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులను మంజూరు చేస్తున్నారో.. అలాగే నిర్మాణ రంగ అనుమతులకూ ప్రత్యేక పాలసీని తీసుకురావాలి. సింగిల్‌ విండో సిస్టమ్‌లో నిర్మాణ అనుమతులిచ్చే మున్సిపల్‌ శాఖతో పాటూ అగ్నిమాపక, నాలా కన్వర్షన్, ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్, మైన్స్‌ అండ్‌ జియోలజీ విభాగాలనూ భాగస్వామ్యం చేయాలి.

అప్పుడే అనుమతుల మంజూరులో జాప్యం తగ్గడంతో పాటూ అవినీతి కూడా తగ్గుతుందని.. దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తాయని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) అభిప్రాయపడింది. ఇటీవల టీబీఎఫ్‌ నాల్గవ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీబీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ జక్కా వెంకట్‌ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఇంటి నిర్మాణం అంటే మున్సిపల్‌ పర్మిషన్‌ నుంచి మొదలుపెడితే జలమండలి, అగ్నిమాపక, పోలీస్, పర్యావరణ, ఎయిర్‌పోర్ట్‌.. వంటి చాలా ప్రభుత్వ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని (ఎన్‌వోసీ) తీసుకోవాలి. ఇందుకోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని.. కాబట్టి ఒక్క దరఖాస్తుతోనే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్‌వోసీలను జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.  
    రెవెన్యూ ల్యాండ్‌లను జియో ట్యాగింగ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ శాఖతో అనుసంధానం చేయాలి. అప్పుడే భూములకు వర్చువల్‌ బౌండరీలు కనిపిస్తుంటాయి. దీంతో ద్వంద్వ రిజిస్ట్రేషన్స్‌ వంటి అక్రమాలకు తావుండదు.
    అభివృద్ధి నగరం నలువైపులా విస్తరించాలి. లుక్‌ ఈస్ట్‌ పాలసీతో తూర్పు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉప్పల్‌లోని ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ మొత్తాన్ని ఐటీ జోన్‌గా ప్రకటించాలి. పోచారంలోని రహేజా ఐటీ పార్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. నివాసితులకు ఆరోగ్య వాతావరణం కోసం నగరంలోని పార్క్‌లను కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్స్‌లాగా అభివృద్ధి చేయాలి.

నెలకొకసారి స్థల మార్పిడి కమిటీ..
ప్రస్తుతం ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ కమిటీ 2–3 నెలలకొకసారి సమావేశం అవుతోంది. దీంతో స్థల మార్పిడికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా ప్రతి నెలకు ఒకసారి సమావేశం జరగాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలు, ఓపెన్‌ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌)పై కోర్టు కేసులో ఉంది. దీన్ని త్వరితగతిన పరిష్కరించి అందుబాటులోకి తీసుకురావాలి. దీంతో చాలా మంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారు.


ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్‌
ఒక సర్వే నంబరులో ఉండే వేల ఎకరాల్లో కొంత స్థలానికి ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే.. రెవెన్యూ శాఖ ఆ సర్వే నంబరు అంతటినీ ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్‌ కింద పెట్టేస్తున్నారు. దీంతో ఆ సర్వే నంబరులోని మిగిలిన స్థలానికి రిజిస్ట్రేషన్స్‌ జరగట్లేదు. ఏ స్థలం వరకైతే లీగల్‌ సమస్యలున్నాయో అంత వరకే ప్రొహిబిషనరీ విధించాలి. లేకపోతే మిగిలిన స్థలంలోని కొనుగోలుదారులకు నష్టం వాటిల్లుతుంది.

   ఉదాహరణకు భోగారం సర్వే నంబరు 281లో మొత్తం 12 ఎకరాల 19 గుంటల భూమి ఉంది. ఇందులో 4 ఎకరాల 2 గుంటలు పట్టా, 8 ఎకరాల 17 గుంటలు అసైన్డ్‌ ల్యాండ్‌. దీంతో రెవెన్యూ విభాగం ఈ సర్వే నంబరును ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్‌ కింద పెట్టేసింది. దీంతో పట్టా ల్యాండ్‌లో భూమి కొన్నా.. రిజిస్ట్రేషన్స్‌ జరగట్లేదు. ఇదే అదనుగా ఆ సర్వే నంబరులోని పట్టా ల్యాండ్‌ రిజిస్ట్రేషన్స్‌కు కూడా సబ్‌–రిజిస్ట్రార్లకు చేతులు తడపాల్సి వస్తోంది. అలా కాకుండా సర్వే నంబరు 281 (ఏ), (బీ) అని ప్రత్యేకంగా చూపించినట్లయితే.. కొనుగోలుదారులకు ఇబ్బందులుండవు.. జేబు భారమూ తప్పుతుంది. – సీ ప్రభాకర్‌ రావు, టీబీఎఫ్‌ ప్రెసిడెంట్‌


విజయవాడ రోడ్‌లో దృష్టి
మెట్రో రైల్‌ ప్రారంభం, ఫ్లై ఓవర్, అండర్‌ పాస్‌ బ్రిడ్జీల నిర్మాణంతో ఇప్పుడు ఎల్బీనగర్‌ ప్రాంతం అత్యంత బిజీ ఏరియాగా మారింది. పోచారం ఐటీ హబ్‌తో వరంగల్, ఆదిభట్ల ఎయిరో స్పేస్‌ హబ్‌తో సాగర్‌ రోడ్‌ ఎలాగైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయో.. అలాగే విజయవాడ జాతీయ రహదారిలోనూ అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రకటించాలి. దీంతో నగరం నలువైపులా సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది. – టీ నరసింహా రావు, ఈస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌

కార్మికులకు బీమా సౌకర్యం
భవన నిర్మాణ రంగంలో నైపుణ్యమున్న కార్మికులున్నారు. నిర్మాణ సమయంలో జరిగే ప్రమాదాలకు డెవలపర్లను బాధ్యుల్ని చేయడం, కేసులు పెట్టడం సరైంది కాదు. భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినట్లవుతుంది. – ఎం. సీహెచ్‌ రాఘవరావు,వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌

లేబర్‌ సె‹స్‌పై అవగాహన
నగరంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. నగరం చుట్టూ ఇసుక డిపోలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. డెవలపర్ల నుంచి వసూలు చేసే లేబర్‌ సెస్‌ ప్రభుత్వం వద్ద మూలుగుతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ సొమ్మును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.   – ఎం. శ్రీనివాసన్, కూకట్‌పల్లి బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌

మరిన్ని వార్తలు