ఎన్‌పీఏలుగా ప్రకటనకు గడువు పెంపు!

14 Jun, 2017 01:00 IST|Sakshi
ఎన్‌పీఏలుగా ప్రకటనకు గడువు పెంపు!

న్యూఢిల్లీ: ఎన్‌పీఏలుగా ప్రకటించేందుకు ప్రస్తుతమున్న 90 రోజుల కాల వ్యవధిని మరింత పెంచాలన్న అభ్యర్థనను ఆర్‌బీఐ పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ ప్రతిపాదన తమకు అందిందని, అది ప్రస్తుతం ఆర్‌బీఐ పరిశీలనలో ఉన్నట్టు ఓ వార్తా సంస్థకు చెప్పారు. ప్రతిపాదన ఎవరినుంచి వచ్చిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఓ రుణానికి సంబంధించి వరుసగా మూడు నెలల పాటు (90 రోజులు) వాయిదాలు చెల్లించకపోతే దాన్ని మొండి బాకీ (ఎన్‌పీఏ)గా వర్గీకరించాల్సి ఉంటుంది.

సాధారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థల నుంచి చెల్లింపులు ఆలస్యంగానే వస్తుంటాయి. ఒక్కసారి చెల్లింపుల్లో ఈ గడువు దాటితే వీటికిచ్చిన రుణాలు ఎన్‌పీఏలుగా మారడం, ఆ తర్వాత వాటికి రుణాలు రావడం కష్టంగా మారుతుంది. ఒకవేళ ఆర్‌బీఐ గడువు పెంచితే చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఉపశమనం లభించనుంది. కాగా, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసే చర్యల్లో భాగంగా రుణాల పునరుద్ధరణకు ప్రస్తుతమున్న యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని మేఘ్‌వాల్‌ అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు