షోకాజు నోటీసును పరిశీలిస్తున్నాం: నెస్లే

19 Dec, 2019 03:37 IST|Sakshi

ముంబై: జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని నెస్లే ఇండియా వినియోగదారులకు వెంటనే బదిలీ చేయకుండా అక్రమంగా లాభాలను ఆర్జించిందంటూ లాభాపేక్ష నిరోధక విభాగం (ఎన్‌ఏఏ) జారీ చేసిన షోకాజు నోటీసును పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయకుండా ప్రయోజనం పొందినందుకు రూ.90 కోట్లు చెల్లించాలని ఎన్‌ఏఏ ఈ నెల 12న జారీ చేసిన షోకాజు నోటీసులో నెస్లే ఇండియాను ఆదేశించడం గమనార్హం.

గ్రాముల్లో చేసిన మార్పులకు సంబంధించిన ఆధారాలను సమర్పించినా గానీ ఈ ఆదేశాలు జారీ చేయడం ఎంతో దురదృష్టకరమని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్‌ నారాయణన్‌ బుధవారం సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ వార్తా సంస్థతో చెప్పారు. షోకాజు నోటీసును పరిశీలించాక అవసరమైతే తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేవారు. ‘‘రూ.2, రూ.5 ఉత్పత్తిపై జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనం రూ.0.45, 0.55 పైసల చొప్పున బదిలీ చేయాలి. కాకపోతే కాయిన్లు అందుబాటులో లేవు. మరి ఈ ప్రయోజనాలను ఎలా బదిలీ చేస్తాం? అందుకే ఈ మేర గ్రాములను (బరువును) పెంచడం ద్వారా ప్రయోజనాన్ని బదిలీ చేశాం. అయినా ఈ ఆదేశాలు వెలువడ్డాయి’’ అని ఈ కేసు గురించి నారాయణన్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు