-

భారత్‌లో కొత్త ‘ఏసీ’ బ్రాండ్లు

12 Apr, 2019 10:48 IST|Sakshi

కంపెనీలను ఆకట్టుకుంటున్న అమ్మకాలు

ఈ ఏడాది 15 శాతం వృద్ధి అంచనా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎయిర్‌ కండీషనర్ల మార్కెట్లోకి కొత్త బ్రాండ్లు ఎంట్రీ ఇస్తున్నాయి. మరికొన్ని రీ–ఎంట్రీ చేస్తున్నాయి. దేశీయంగా ఏసీల అమ్మకాలు ఆకర్షణీయంగా ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటికే 12 దాకా బ్రాండ్లు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఏటా వందలాది మోడళ్లతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఇతర కంపెనీలకు సవాల్‌ విసురుతున్నాయి. ఇప్పుడు కొత్త బ్రాండ్ల రాకతో పోటీ తీవ్రతరం కానుంది. 2018–19లో దేశవ్యాప్తంగా 55 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో 15 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. వచ్చే అయిదేళ్లలో అమ్మకాలు రెండింతలకు చేరుకుంటాయని పరిశ్రమ ధీమాగా ఉంది.

ఒకదాని వెంట ఒకటి..
యూరప్‌కు చెందిన ట్రూవిజన్‌ భారత్‌లో ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. ప్యానాసోనిక్‌ ఆన్‌లైన్‌ బ్రాండ్‌ అయిన సాన్యో ఏసీల విభాగంలోకి ప్రవేశించింది. రూ.24,490ల నుంచి మోడళ్లు లభ్యం అవుతున్నాయి. లివ్‌ప్యూర్‌ బ్రాండ్‌తో ఎయిర్, వాటర్‌ ప్యూరిఫయర్ల రంగంలో ఉన్న ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ ఏసీల విక్రయాల్లోకి రంగ ప్రవేశం చేస్తోంది. ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ ఫంక్షన్స్‌తో కూడిన స్మార్ట్‌ ఏసీలను ఏప్రిల్‌ చివరికల్లా ప్రవేశపెడతామని లివ్‌ప్యూర్‌ ఫౌండర్‌ రాకేశ్‌ మల్హోత్రా వెల్లడించారు. యురేకా ఫోర్బ్స్‌ హెల్త్‌ కండీషనర్ల పేరుతో ఈ విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రైవేట్‌ లేబుల్‌ బ్రాండ్‌ మార్క్యూ క్రమంగా ఏసీల శ్రేణిని విస్తరిస్తోంది. నూతనంగా ఇన్‌సిగ్నియా శ్రేణిని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్స్‌ సంస్థ షార్ప్‌ ఏసీల విపణిలోకి రీ–ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఎల్టెక్‌ అప్లయెన్సెస్‌తో డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందం చేసుకుంది. 

పోటీలో లేని చైనా..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 14 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒక్క చైనా వాటా అత్యధికంగా 8 కోట్ల యూనిట్లు ఉంది. ఏసీల తయారీలో సామర్థ్యం పరంగా చైనా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. అయినప్పటికీ భారత్‌లో ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాయి. దీనికి కారణం దేశంలో అమలులో ఉన్న బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) కఠిన ప్రమాణాలే. విద్యుత్‌ను గణనీయంగా ఆదాచేసే ఉపకరణాలను తయారు చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకోసారి బీఈఈ ఈ ప్రమాణాలను సవరిస్తోంది. అంటే అంత క్రితం 5 స్టార్‌ ఉన్న ఏసీ కాస్తా కొత్త ప్రమాణాలతో 3 స్టార్‌ అవుతుంది. ఈ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందేనని బ్లూస్టార్‌ జేఎండీ బి.త్యాగరాజన్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. రెండేళ్లకోసారి సాంకేతిక మార్పులు చేపట్టడం భారీ తయారీ సామర్థ్యం ఉన్న చైనా కంపెనీలకు సాధ్యం కాదని.. ఇది అధిక వ్యయంతో కూడినదని అన్నారు. అందుకే చైనా కంపెనీలు ఇక్కడ ప్రవేశించలేకపోతున్నాయని వివరించారు. 

అమలులో ఈ–వేస్ట్‌ రూల్స్‌..: పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ–వేస్ట్‌ (మేనేజ్‌మెంట్, హ్యాండ్లింగ్స్‌) రూల్స్‌ను 2012 మే 1 నుంచి అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీలు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. ఇందులో ఏసీలకు 2017–18 నుంచి ఈ నిబంధనలు వర్తించాయి. దీని ప్రకారం 10 ఏళ్ల క్రితం ఒక కంపెనీ తాను విక్రయించిన యూనిట్లలో 10 శాతం తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా కొనుగోలు చేయాల్సిన యూనిట్లు 2021–22 నాటికి 50 శాతం కానుంది. రీప్లేస్‌మెంట్‌ వేగంగా అయ్యేందుకు కంపెనీలు ఎక్స్‌చేంజ్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

మరిన్ని వార్తలు