క్లిక్ దూరంలో రిటైల్ సంస్థలు

23 Apr, 2016 00:39 IST|Sakshi
క్లిక్ దూరంలో రిటైల్ సంస్థలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంటింట్లోని సామగ్రి నుంచి ఒంటి మీద ఫ్యాషన్ వరకూ ప్రతీది ఆన్‌లైన్‌లో కొనే రోజులివి. అయితే ఎన్ని ఈ-కామర్స్ సంస్థలొచ్చినా.. నేరుగా షాపుకెళ్లి కొనాలనుకునే వస్తువులను ప్రత్యక్షంగా చూస్తూ.. తాకుతూ కొనేస్తే ఆ అనుభూతే వేరు. నిజమే కానీ మనకు దగ్గర్లో ఏ రిటైల్ షాపులున్నాయి? అందులోని ఆఫర్లు.. ఉత్పత్తులు, సేవల వివరాలెలా తెలుసుకోవాలి?.. ఇదిగో దీనికి పరిష్కారమే వాక్‌టుషాప్.కామ్. మరిన్ని వివరాలు సంస్థ కో-ఫౌండర్ వెంకట్ మాటల్లోనే..

నాతో పాటూ గోవింద రాజుల పుట్ట, సతీష్, సంజీవ్ నలుగురం కలిసి రూ.2 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో వాక్‌టుషాప్ స్టార్టప్‌ను ప్రారంభించాం. వాక్‌టుషాప్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫ్‌లైన్ సంస్థలు, వాటి ఉత్పత్తులు, ఆఫర్ల గురించి ప్రచారం చేయడమే మా ప్రత్యేకత.

మా సేవల విషయానికొస్తే.. మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న కస్టమర్లకు వారున్న చోటు నుంచి 2 కి.మీ. పరిధిలో ఉన్న రిటైల్ స్టోర్ల జాబితా అంతా సెల్‌ఫోన్‌లోకి వచ్చేస్తుంది. అవసరమైతే నేరుగా ఆయా సంస్థలతో చాటింగ్ చేసే వీలూ ఉంటుంది. దీంతో ఎంచక్కా కావాల్సింది నేరుగా కొనేసుకోవచ్చు. ఈ డేటాబేస్ కోసం గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నాం. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు రిటైలర్లకు అందిస్తాం.

వ్యాపార విధానం విషయానికొస్తే.. వాక్‌టుషాప్‌తో ఒప్పందం చేసుకున్న రిటైల్ సంస్థలకు వారి వారి ఉత్పత్తుల ప్రదర్శన, రాయితీలు, ఆఫర్ల ప్రదర్శన కూడా చేసుకునే వీలుంటుంది. జియో ఫెన్సింగ్ సేవలను కూడా అందిస్తున్నాం. ఇదేంటంటే.. మా వద్ద రిజిస్టరైన కస్టమర్ సంబంధిత స్టోర్‌కు 200 మీటర్ల సమీపంలోకి  రాగానే ఆయా స్టోర్ల వివరాలు, ఆఫర్ల వివరాలు నోటిఫికేషన్ రూపంలో సెల్‌ఫోన్‌కు చేరతాయి.

  బీకాన్ పేరుతో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) అనే మరో సేవలందిస్తున్నాం. ఇదేంటంటే.. కస్టమర్ సెల్‌ఫోన్‌లో బ్లూ టూత్ ఆన్‌లో ఉంటే చాలు.. ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు మాతో ఒప్పందం చేసుకున్న స్టోర్లకు చేరువకాగానే ఆటోమెటిక్‌గా ఆ స్టోర్ వివరాలు, ఆఫర్ల వివరాలు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ సేవలను మ్యాక్స్, యూసీబీ సంస్థలు పొందుతున్నాయి.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పాటూ డెస్క్‌టాప్‌ల్లో కూడా సేవలందిస్తున్నాం. ప్రస్తుతం 400 రిటైలర్లు సుమారు 700 స్టోర్లు మా సంస్థలో నమోదయ్యారు. 5 వేల మంది కస్టమర్లు మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సేవలు పొందుతున్నారు. చార్జీల విషయానికొస్తే.. ఆయా సేవలను బట్టి నెలకు రూ.1,500 నుంచి రూ.10 వేల వరకున్నాయి.

మరిన్ని వార్తలు